డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ సీజన్ 19లో తన హావా కొనసాగిస్తోంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది.రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ 71 (46; 7×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. రింకూ సింగ్ 49 నాటౌట్ (29; 3×4, 2×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. కామెరూన్ గ్రీన్ 32 (24; 3×4, 1×6) పర్వాలేదనిపించాడు. అజింక్య రహానే (19), ఫిన్ అలెన్ (18) పరుగులు చేశారు. దీంతో ఒక మంచి లక్ష్యాన్ని కోల్ కతా టీమ్ బెంగళూరు ముందు ఉంచింది. ఇక బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్ దర్, హేజల్ వుడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు 37 పరుగుల వద్ద బెతెల్ (15) వికెట్ కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ 105 నాటౌట్ (60; 11×4, 3×6) సెంచరీతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు. దేవ్ దత్ పడిక్కల్ 39 (27; 7×4) పరుగులు చేశాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడే విరాట్ కోహ్లీ మరోసారి తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కోల్ కతా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. విరాట్ క్రీజులో ఉండడంతో ఎక్కడా కూడా బెంగళూరు మ్యాచ్ మీద పట్టు కోల్పోలేదు. సునాయాసంగా 19.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్ కతా బౌలర్లలో కార్తీక్ త్యాగి 3 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో బెంగళూరు టేబుల్ టాపర్ గానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 17 మ్యాచ్ లలో 8 మ్యాచ్ లు గెలిచి 16 పాయింట్లు సాధించింది.