ఇప్పుడే అరంగ్రేటం చేసిన కుర్రాడిలా ఆడుతూ వికెట్ల మధ్య పరుగులు తీస్తుంటే అంతర్జాతీయ స్థాయి బౌలర్లు మాత్రం ఏం చేస్తారు…సాధారణ ప్రేక్షకుల్లా చూస్తుండడం తప్ప. కొత్త కొత్త కుర్రాళ్లు కూడా ఏదో ఎడాపెడా బాదేసి పరుగులు చేసేసి తరువాత మామూలుగానే తడబాటుకు గురవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ ప్రారంభం నుండి ఒకే టీమ్ కు ఆడుతూ అదే స్థాయిలో రాణిస్తుండడం ఒక్క రన్ మెషీన్ కే సాధ్యం. వయసు పైబడుతున్నా ఇంకా పర్ఫెక్ట్ ఫిట్ గా కనిపిస్తూ ఆటలో కూడా అదే స్పీడ్ ను కొనసాగిస్తూ అదరగొడుతున్నాడు క్రికెట్ కింగ్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ ఆటతీరు ఎప్పుడూ ఒక అద్భుతమే. ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, తాజాగా కోల్ కతా మ్యాచ్‌లో అతను పుంజుకున్న తీరు చూస్తుంటే ‘ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్’ అనే మాట సరిగ్గా అతనికి సరిపోతుందని చెప్పవచ్చు. ట్రోలర్స్ కు తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతూ, మైదానంలో అతను రన్స్ చేసిన తీరు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సుదీర్ఘ ఎదురు చూపులకు చెక్ పెడుతూ గతేడాది మొట్ట మొదటి సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆ జట్టు ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. ఒక ఛాంపియన్ టీమ్ ఎలా ఆడాలో అలా ఆడుతూ ఈ సీజన్ లో బెంగళూరు టీమ్ దూసుకుపోతోంది. ఈ విజయాల్లో తన జట్టుకు కోహ్లీ ఒక బలమైన భరోసాగా నిలిచాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఈ సీజన్లో అతను సాధించిన పరుగులు ఆడుతున్న తీరు చూస్తుంటే ప్రతి క్రికెట్ అభిమాని ఫీలింగ్ ఒకటే. విరాట్ అనవసరంగా ఈ ఫార్మాట్ నుండి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడేమో అనిపించక మానదు. ఈ సీజన్ లో కోహ్లీ 12 ఇన్నింగ్స్‌ల్లో 484 పరుగులు చేశాడు. అతను 53.77 యావరేజ్ తో 165.75 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందులో ఒక సెంచరీ మరియు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఇదే సీజన్లో, ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని దాటిన మొట్ట మొదటి ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెబుతాం దాదాపుగా రెండు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా..బంతికి అనుగుణంగా క్రీజులో కదులుతూ అత్యంత అద్భుతమైన నైపుణ్యంతో షాట్లు ఆడడం స్టాండ్స్ లో కూర్చున్న ప్రేక్షకులు తమ వంతుగా కేరింతలు కొట్టడం ఇది పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో అతను చూపే కంట్రోల్, స్పిన్నర్ల బౌలింగ్ లో చక్కగా ఆడే విధానం సూపర్ అంతే. ఏదో బాల్ ను బలంగా ఎడాపెడా కొట్టేయడం కాకుండా సంప్రదాయ క్రికెట్ షాట్లతో ఆడడం కోహ్లీ స్పెషలిటీ. అతని బ్యాటింగ్ శైలిలో క్లాసికల్ టచ్ తో పాటు మోడ్రన్ రిథమ్ కూడా కనిపిస్తుంది.సొగసైన కవర్ డ్రైవ్స్ తో క్లాప్స్ కొట్టిస్తాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లీ ఆడే కవర్ డ్రైవ్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందంటే ఆశ్చర్యం కాదు. బంతిని బ్యాట్ మిడిల్ లో టైమ్ చేస్తూ చక్కటి టైమింగ్ తో పాయింట్ మరియు కవర్ల మధ్య నుంచి బాల్ ను బౌండరీకి పంపించడం ఒక పర్ఫెక్ట్ ఆర్ట్ లా ఉంటుంది. తన రిస్ట్ ను ఉపయోగించి ఆడే ఫ్లిక్ షాట్లు, షార్ట్ పిచ్ బాల్స్ ను పుల్ చేసే విధానం ఆహా వేటికవే ప్రత్యేకం. బౌలర్లపై అతను ఆధిపత్యం ప్రదర్శించే తీరు కోహ్లీని ఈ మోడ్రన్ క్రికెట్ లో రారాజును చేసాయి.
కేవలం బ్యాటింగ్, షాట్ సెలెక్షన్ మాత్రమే కాదు. కోహ్లీ ఫిట్నెస్ వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ రన్స్ ను రాబట్టే విధానం సూపర్ అంతే. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే ఒక బండిని స్టార్ట్ చేసినట్లు మెల్లగా స్టార్ట్ చేసి వేగంగా గేర్లు మారుస్తూ ఆడుతూ ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే ఇన్ని రన్స్ చేశాడా? అని అనిపించేలా అబ్బురపరుస్తాడు కోహ్లీ. అనవసరమైన షాట్లను ఆడకుండా సింగిల్స్ మరియు డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అసలైన క్రికెట్ కు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తాడు.. వికెట్ల మధ్య అతను పరిగెత్తే వేగం ఫీల్డర్లను ఎప్పుడూ ఒత్తిడిలోకి నెడుతుంది. ఒక్కోసారి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ కూడా కోహ్లీ స్పీడ్ ను అందుకోలేక పోవడం మనం మ్యాచ్ లలో చూస్తూనే ఉంటాం. అంతటి అద్భుతమైన ఫిట్ నెస్ తో ఉంటాడు మన కింగ్. ఈ రకమైన ఓర్పు, నిలకడ, ఫిట్ నెస్ జట్టును విజయం వైపు నడిపించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. విరాట్ కోహ్లీ మానసిక స్థైర్యం కూడా దుర్బేధ్యంగా ఉంటుంది. జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు అతనిలోని అసలు సిసలు బ్యాటర్ మేల్కొంటాడు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా గేర్ మారుస్తూ గేమ్ ను ప్రత్యర్థుల నుండి లాగేసుకుంటాడు. అందుకే అతనిని ‘ఛేజ్ మాస్టర్’ అంటుంటారు.
తాజాగా కోల్ కతా మ్యాచ్ లో అతను ఆడిన తీరు ఐపీఎల్ చరిత్రలో మరో అద్భుత సెంచరీని సాధించి అజేయంగా నిలిచిన విధానం ఈ మోడ్రన్ ప్రపంచ క్రికెట్ కు అతను ఎందుకు రారాజు అనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. మొత్తంగా బెంగళూరు జట్టు సమష్టి విజయంలో కోహ్లీ పాత్ర కీలకమన్నది సుస్పష్టం. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి ఛాంపియన్ అవ్వాలంటే స్థిరత్వం చాలా ముఖ్యం. ఆ స్థిరత్వాన్ని కోహ్లీ తన బ్యాటింగ్ ద్వారా అందిస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఐకాన్ గా నిలుస్తూ మైదానంలో అతను చూపే ఉత్సాహం టీమ్ కు ప్రధాన బలం. రాబోయే మ్యాచ్‌లలో కూడా కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగిస్తే, తన జట్టు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుని సత్తా చాటే అవకాశాలున్నాయి.