ఐపీఎల్ సీజన్ 19లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగిస్తోంది. ఆ జట్టు తాజాగా 9 విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మొదటి 7 మ్యాచ్ లలో అజేయంగా కొనసాగిన పంజాబ్ కింగ్స్ ఆ తరువాత వరుసగా తడబడుతూ తాజాగా వరుసగా 6వ ఓటమిని నమోదు చేసుకుంది. ధర్మశాల వేదికగా తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 23 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 58 (37; 4×4, 3×6) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. దేవ్ దత్ పడిక్కల్ 45 (25; 4×4, 3×6) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక వెంకటేష్ అయ్యర్ 73 నాటౌట్ (40; 8×4, 4×6) టాప్ స్కోరర్. మంచి ఇన్నింగ్స్ తో బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టిమ్ డేవిడ్ 28 (12; 2×4, 2×6) పరుగులు చేశాడు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం రన్ రేటు పెరుగుతూ పోవడంతో ఆ స్కోరుకే పరిమితమైంది. శశాంక్ సింగ్ 56 (27; 4×4, 4×6) చివరి వరకు పోరాడాడు. కూపర్ కన్నోలి 37 (22; 3×4, 3×6), మార్కస్ స్టోయినీస్ 37 (25; 5×4), సూర్యన్ష్ షెడ్గే 35 (22; 2×4, 2×6) పరుగులు చేశారు. ఇక బెంగళూరు బౌలర్లలో రసిఖ్ సలామ్ దర్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, జోష్ హాజల్ వుడ్, సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ స్థానాన్ని పదిలం చేసుకుని 18 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.