వందల టన్నుల బరువును తేలికగా ఎత్తేసే భారీ హైడ్రాలిక్ క్రేన్లు.. కేవలం ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న దేవుడి విగ్రహాన్ని అంగుళం కూడా కదపలేకపోయాయి. సాక్షాత్తు మహాకాళేశ్వరుడు కొలువైన మధ్యప్రదేశ్‌లోని పరమ పవిత్ర ఉజ్జయిని నగరంలో లక్షలాది మంది కళ్లెదుట జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. రోడ్డు విస్తరణ కోసం 170 ఏళ్ల నాటి ప్రాచీన ఖడే హనుమాన్ ఆలయాన్ని కూల్చేసి, విగ్రహాన్ని తరలించాలని ఇంజనీర్లు ప్లాన్ చేశారు. కానీ వరుసగా మూడు రోజుల పాటు వారు వాడిన క్రేన్లు, జేసీబీలు చేయలేకపోయాయి. ఇక అదే సమయానికి విగ్రహం చుట్టూ యాభైకి పైగా కోతుల గుంపు రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. 2028లో ఉజ్జయిని నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింహస్థ కుంభమేళా జరగబోతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం రద్దీకి తగినట్లుగా రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కాంఠల్ చౌరహా నుంచి ఛత్రీ చౌక్ వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ప్రాచీన ఖడే హనుమాన్ ఆలయం రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, గుడి గోడలను మాత్రమే కూల్చేసి, లోపల ఉన్న 8 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అత్యంత జాగ్రత్తగాతీసి సమీపంలోని టంకీ చౌక్ వద్ద పునఃప్రతిష్టించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం సెప్టెంబర్ 4వ తేదీన భారీ యంత్రాలు, ఇంజనీర్ల బృందంతో కార్పొరేషన్ సిబ్బంది ఆలయం వద్దకు చేరుకున్నారు. గుడి గోడలను, పైకప్పును సులభంగానే కూల్చేశారు. అయితే విగ్రహాన్ని బయటకు తీయడానికి మొత్తం 36 గంటల్లో 4 సార్లు తీవ్రంగా ప్రయత్నించారు. తొలిరోజు విగ్రహాన్ని క్రేన్‌తో కదపడానికి ఇనుప చైన్లు కడుతుండగా.. ఉన్నట్టుండి భారీ ఎలక్ట్రికల్ స్పార్క్ రావడం, కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పనులు ఆపేశారు. ఇక రెండో రోజు భారీ జేసీబీలతో రంగంలోకి దిగితే, ఆకాశం మేఘావృతమై ఉన్నట్టుండి భారీ వర్షం కురవడంతో యంత్రాలు పనిచేయక ఆ రోజు కూడా వెనుతిరిగారు. ఇక మూడవ రోజు అధికారులు సర్వశక్తులు ఒడ్డి, అత్యంత శక్తివంతమైన హైడ్రాలిక్ క్రేన్లను తెప్పించారు. చైన్లు కట్టి విగ్రహాన్ని పైకి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే ఇంజనీర్ల మైండ్ బ్లాక్ అయింది. అంతటి భారీ క్రేన్లు ఫుల్ పవర్‌తో లాగుతున్నా కూడా.. ఆ రాతి విగ్రహం కనీసం ఒక ఇంచు కూడా కదల్లేదు. విగ్రహం భూమిలోకి ఎంత బలంగా నాటుకుపోయి ఉందంటే, ఇంకొంచెం బలంగా ప్రయత్నిస్తే ఎక్కడ విగ్రహం విరిగిపోయి అపచారం జరుగుతుందో అన్న భయంతో అధికారులు క్రేన్లను ఆపేశారు. 170 ఏళ్లుగా భూమిలో ఉన్న ఒక విగ్రహాన్ని, ఈ రోజుల్లో ఉన్న అధునాతన మెషినరీ కదపలేకపోవడం ఇంజనీరింగ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.క్రేన్లు ఫెయిల్ అయ్యి అధికారులు పనులు ఆపేసిన తదుపరి రోజు ఆ ఆలయ శిథిలాల వద్దకు ఉన్నట్టుండి దాదాపు 50 కి పైగా వానరాల గుంపు ఆ విగ్రహం చుట్టూ, పక్కనున్న ఇళ్ల పైకప్పుల మీదకు చేరుకున్నాయి. విగ్రహాన్ని రక్షించడానికి సాక్షాత్తు హనుమంతుడే తన వానర సైన్యాన్ని పంపాడని, స్వామికి అక్కడి నుంచి కదలడం ఏమాత్రం ఇష్టం లేదని భక్తుల నమ్మకం అమాంతం పెరిగిపోయింది. క్షణాలు గడిచేకొద్దీ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఆ ఖడే హనుమాన్ విగ్రహం దగ్గరకు చేరుకోవడం మొదలుపెట్టారు. కోతుల మధ్య కొలువై ఉన్న స్వామి మహిమను కీర్తిస్తూ అక్కడే హనుమాన్ చాలీసా పఠించారు. రాత్రి సమయంలో మహా హారతులు ఇచ్చారు. స్థానిక హిందూ సంఘాలు అధికారులకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చాయి. స్వామి వారు తాను ఎక్కడున్నానో అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. దయచేసి విగ్రహాన్ని బలవంతంగా కదపొద్దు. ఒకవేళ విగ్రహానికి పగుళ్లు వస్తే ఉజ్జయిని మొత్తం అగ్నిగుండం అవుతుంది అని హెచ్చరించాయి.
ఇక సైన్స్ పరంగా ఆలోచిస్తే, దీని వెనుక ఒక అద్భుతమైన ప్రాచీన ఆర్కిటెక్చర్ దాగి ఉంది. ఉజ్జయిని విక్రమ్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమణ్ సోలంకి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విగ్రహం 170 ఏళ్ల నాటిది కాదని, ఏకంగా 1000 ఏళ్ల క్రితం నాటి పరమార రాజవంశానికి చెందిన రాజా భోజుడి కాలం నాటిదని ఆయన విశ్లేషించారు. ఆ కాలంలో ఇలాంటి భారీ విగ్రహాలను అత్యంత కఠినమైన బసాల్ట్ రాళ్లతో చెక్కేవారు. భూకంపాలు వచ్చినా విగ్రహం పడిపోకుండా ఉండటం కోసం.. విగ్రహం భూమి పైన 8 అడుగులు కనిపిస్తే, భూమి లోపల దానికి రెట్టింపు లోతులో భారీ రాళ్లు ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ తో పునాది వేసేవారు. అంటే విగ్రహం కింద ఉన్న రాళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేసి భూమిలో అత్యంత లోతుగా బంధించారు. ఆ పురాతన టెక్నాలజీ వల్లే ఇప్పుడు క్రేన్లు ఎంత లాగినా విగ్రహం రావడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు మున్సిపల్ అధికారులు తమ తప్పు తెలుసుకున్నారు. బలవంతంగా క్రేన్లతో పీకేయడం మానేసి, ఆర్కియాలజీ నిపుణులను రంగంలోకి దించారు. అత్యాధునిక 3D స్కానర్ల ద్వారా విగ్రహం లోతును, కింద ఉన్న రాతి నిర్మాణాన్ని స్కాన్ చేస్తున్నారు. విగ్రహం భూమిలో ఎంత లోతు ఉందో కచ్చితంగా తెలిసిన తర్వాతే, అత్యంత సురక్షితమైన శాస్త్రీయ పద్ధతిలో దాన్ని ఎలా తరలించాలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి విగ్రహంపై ఎలాంటి వాతావరణ ప్రభావం పడకుండా ఒక టెంట్ వేశారు. ఈ మొత్తం మనకు చెబుతున్నది ఒక్కటే.. అభివృద్ధి పేరుతో వేల ఏళ్ల నాటి కట్టడాలను, విశ్వాసాలను మనం తేలికగా తీసిపారేయకూడదు. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యం ముందు నేటి క్రేన్లు కూడా దిగదుడుపే అని ఉజ్జయిని ఖడే హనుమాన్ నిరూపించారని చర్చించుకుంటున్నారు.