ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చింది. ప్లే ఆఫ్ రేసులో పోటీ పడుతున్న ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన తాజా మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 53 (40; 5×4, 2×6), రియాన్ పరాగ్ 51 (26; 3×4, 5×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వైభవ్ సూర్యవంశీ 46 (21; 5×4, 3×6) మెరుపు బ్యాటింగ్ తో అలరించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కట్టడి చేయగలిగారు. మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో రాణించాడు. లుంగీ ఎంగిడి, మాధవ్ తివారీ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు కే.ఎల్.రాహుల్ 56 (42; 1×4, 3×6), అభిషేక్ పోరెల్ 51 (31; 7×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించి మొదటి వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సాహిల్ పరేఖ్ (9), ట్రిస్టన్ స్టబ్స్ (4), డేవిడ్ మిల్లర్ (9) స్వల్ప పరుగులకే వెనుదిరిగినా అక్షర్ పటేల్ 34 నాటౌట్ (18; 2×4, 2×6), అశుతోష్ శర్మ 18 నాటౌట్ (5; 1×4, 2×6) రాణించి సునాయాసంగా ఢిల్లీ క్యాపిటల్స్ కు గెలుపును అందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్లలో 6 విజయాలు, 7 ఓటములతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. తాజా విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే, వారు టాప్-4లో నిలవాలంటే మిగిలిన టీమ్ ల ఫలితాలపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ జట్టు నెట్ రన్ రేట్ -0.871గా ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి చూస్తే ఆ జట్టుకు ఢిల్లీ కంటే మెరుగైన అవకాశాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రాజస్థాన్ 12 మ్యాచ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ భారీ తేడాతో గెలిచి, నెట్ రన్ రేట్ ను పెంచుకుంటే ఆ జట్టు టాప్-4 చేరుకునే అవకాశం ఉంది.