తెలుగు సినీ పాటకు తన అత్యద్భుత సాహిత్యంతో తరలపాటు నిలిచిపోయే పరిమళాన్ని అందించిన ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి . ‘విధాత తలఁపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆదిప్రణవనాదం’ అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానాన్ని చిరస్మరణీయం చేసింది. తొలి చిత్రం ‘సిరివెన్నెల’ టైటిల్నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు రాసిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. ఆయన జయంతి సందర్బంగా ఆయన్ను మరోసారి గుర్తు చేసుకుందాం. సిరివెన్నెలగా ప్రఖ్యాతి గాంచిన చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ.పూర్తి చేశారు. ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి తన సాహిత్య ప్రతిభను చాటుకున్నారు. ఇక అక్కడ నుండి తెలుగు ప్రేక్షకులు తరలపాటు మరిచిపోలేని అద్భుత సాహిత్యాన్ని నింపుకున్న సుమధుర గీతాలెన్నింటినో రాశారు.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ యువతను తమ గమ్యం వైపు పోరాడే స్ఫూర్తినిచ్చి దిశానిర్దేశం చేశారు. బోటనీ పాఠం ఉంది. మేటనీ ఆట ఉంది. అంటూ కాలేజీ కుర్రకారు జోరును చూపారు. ఎన్నో ఎమోషనల్ సాంగ్స్, డ్యూయెట్స్, విరహ గీతాలు ఇలా ఆయన స్పృశించని ఎమోషనే లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే గీతాలతో దశాబ్దాల పాటు ఉర్రూతలూగించారు. అలాగే ‘క్షణక్షణం’లో ‘జామురాతిరి జాబిలమ్మా’, ‘శుభలగ్నం’లో ‘చిలకా ఏ తోడు లేక’, ‘నిన్నే పెళ్లాడతా’లో కన్నుల్లో నీ రూపమే, ‘నువ్వే కావాలి’లో ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’, ‘బొమ్మరిల్లు’లో ‘నమ్మక తప్పని నిజమైనా’, ‘కొత్త బంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’, ‘చక్రం’లో జగమంత కుటుంబం’, అల వైకుంఠ పురములో’ ‘సామజవరగమన’ ఇలా చెప్పుకొంటే పోతే సీతారామశాస్త్రి పాటల తోటలో మధురమైన ఫలాలు ఎన్నో ఇప్పటికీ సంగీత, సాహిత్య అభిలాషులకు ఆయన పాట లేనిదే రోజు గడవదు. కేవలం సినిమాలకే కాకుండా ‘అమృతం’ వంటి టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ కు ఆయన అందించిన సాహిత్యం 90వ దశాబ్దపు పిల్లలకు ఎంత ఇష్టమో తెలిసిందే కదా…ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాసపడబాకు చాలు అంటూ అప్పట్లో బుల్లితెరపై ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇలా జెనరేషన్స్ ను ఆయన తన పాటలతో మంత్రముగ్దులను చేశారు. ఇక అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రి అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు. ‘కంచె’ చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి గారు 2021 నవంబరు 30న మరణించారు . అప్పటికీ ఇప్పటికి ఎప్పటికి ఆయన రాసిన పాటలను మరచిపోలేము… వివిధ టీవీ సింగింగ్ షోస్ లో ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అవి శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి.