రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకేసింది. కీలక మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ పై భారీ విజయాన్ని అందుకుని సత్తా చాటింది. జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 96 (57; 11×4, 5×6) మరోసారి తనదైన ఆటతీరుతో చెలరేగాడు. జోష్ ఇంగ్లిస్ 60 (29; 7×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. రిషబ్ పంత్ 35 (23; 2×4, 2×6) పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో యష్ రాజ్ పంజా 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసి టార్గెట్ ను ఛేదించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 93 (38; 7×4, 10×6) విధ్వంసక ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. యశస్వీ జైస్వాల్ 43 (23; 8×4,1×6) తో కలిసి మొదటి వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధ్రువ్ జురెల్ 53నాటౌట్ (38; 3×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ సునాయాసంగా విజయం సాధించింది. ఆకాష్ మహారాజ్ సింగ్, మొహసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ప్రస్తుతం మిగిలి ఉన్న ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఆ జట్టుకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా పోటీపడుతున్న మిగిలిన టీమ్ ల కంటే బాగానే ఉంది. ఈ నెల 24న ముంబై ఇండియన్స్ తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ లో గెలిస్తే 16 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా రాజస్థాన్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడిపోతే, ఇతర జట్ల నెట్ రన్ రేట్ మరియు మిగిలిన మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే.