రెండున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులో అద్భుత స్థానాన్ని సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్’ గ్లింప్సె సోషల్ మీడియాలో దుమ్ముదులిపేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ విడుదల చేసిన ఈ గ్లిమ్ప్స్ ఏకంగా నాలుగు నిముషాలు పైగా ఉంది.భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి తనదైన టేకింగ్ తో సత్తా చాటాడు. అతని ఇంతకుముందు సినిమాలను తలపించే విధంగా ఉన్న ఈ అప్డేట్ ఎన్టీఆర్ అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే గ్లింప్స్‌పై సోషల్ మీడియాలో ఎన్నో రోజులుగా భారీ హైప్ నెలకొంది. అందుకే దాని కోసం అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులంతా కూడా ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ‘డ్రాగన్’ గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే ప్రశాంత్ నీల్ మరోసారి తన ప్రత్యేకమైన మాస్ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. కథ ఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది, హీరో పాత్ర ఎలా ఉండబోతోంది, సినిమాలో ఎలాంటి రక్తపాతం ఎమోషన్స్ ఉండబోతున్నాయో ఈ చిన్న వీడియో ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ విజువల్స్, డార్క్ టోన్, భారీ సెటప్ మరోసారి కనిపించాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్, ఈసారి ‘డ్రాగన్’తో మరింత వైలెంట్ మరియు పవర్ఫుల్ వరల్డ్‌ను నిర్మిస్తున్నట్టు కనిపిస్తోంది.బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి కాటన్, స్టీల్, స్పైసెస్ కోసం వచ్చారు. కానీ వాళ్లు ఇక్కడ 250 ఏళ్లు ఉండిపోవడానికి కారణం ఒక మొక్క…” అంటూ మొదలయ్యే వాయిస్ ఓవర్ వెంటనే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది. ప్రపంచంలోనే అత్యంత వ్యసనకారక పదార్థమైన హెరాయిన్ తయారీలో ఉపయోగించే ఓపియమ్ పాపి మొక్క చుట్టూ ఈ కథ తిరుగుతుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. “ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్లను తయారు చేసింది” అనే డైలాగ్ కథలోని డార్క్ నేచర్‌ను మరింత బలంగా చూపించింది. దీంతో ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, భారీ క్రైమ్ డ్రామాగా ఉండబోతోందనే అంచనాలు పెరిగాయి.ఇక ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ కనిపించిన తీరు అభిమానులను అలరిస్తోంది. చాలా రోజుల తర్వాత ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఈ సినిమా కోసం తారక్ బాగా బరువు తగ్గడం, స్లిమ్ లుక్‌లో కనిపించడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. “దేవుడు నాకొక గొప్ప వరం ఇచ్చాడు… ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు… ఇంకా మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనిపిస్తాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు…” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఎన్టీఆర్ నటన వింటేజ్ ఎన్టీఆర్ ను గుర్తు చేసింది. ఇక్కడ గ్లింప్సె లో కథా నేపథ్యాన్నీ పాత్రలను పరిచయం చేశారు. హీరోయిన్ రుక్మిణి వీరందరిని పరిచయం చేసిన తీరు కూడా బాగుంది. ఇక సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ గ్లింప్స్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.