బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఇటీవల జరిగిన వందేమాతరం గీతం ఘటన మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ గీతానికి కొత్త శక్తిని, పునర్జీవాన్ని కల్పిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ విలువలను పక్కనబెడుతోందని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గీతమైన వందేమాతరాన్ని అవమానించిందని అమిత్ షా ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం గీతం పాడుతున్న సమయంలో.. సోనియా గాంధీ స్వయంగా ఆ పాటను మధ్యలోనే ఆపమని కోరారని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిన ఆ గీతాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇలా చిన్నచూపు చూడటం దారుణమని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ పనిని దాదాపు 140 కోట్ల మంది భారతీయులు గమనించారని, దేశ ప్రజలు ఈ పాపానికి ఎన్నటికీ క్షమించరని షా హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ పెంచింది. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ అమర గీతం, మన జాతికి ఒక ఎమోషన్. 80 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కూడా ఈ గీతానికి దేశవ్యాప్తంగా అపారమైన గౌరవం లభిస్తుంటే, సోనియా గాంధీకి అది నచ్చకపోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో వందేమాతరాన్ని అసంపూర్తిగా వదిలేయాలని ఎలా అనుకుంటారని షా నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల్లో కనీసం కొద్దిపాటి సిగ్గు మిగిలి ఉన్నా, వెంటనే బంకిం బాబు ఆత్మకు , దేశ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల నినాదమైన వందేమాతరాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలిచేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. అభివృద్ధిని, జాతీయతా భావాన్ని బీజేపీ ప్రోత్సహిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దేశభక్తికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు మధ్య జరుగుతున్న ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఇక తాజాగా అమిత్ షా చేసిన ఈ తీవ్ర విమర్శల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.