బంగ్లాదేశ్ ప్రధానిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తారిక్ రెహమాన్ భారత్ లో పర్యటించడానికి భారత్ ముందు పెట్టిన కండీషన్స్ పై చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఆగస్టు మూడో వారంలో న్యూఢిల్లీలో పర్యటించాల్సి ఉంది. దీనిపై ఇరు దేశాల అధికారుల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ సరిగ్గా పర్యటన ఖరారయ్యే ముందు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఏకేఎమ్ షాహిదుల్ కరీమ్ తమ ప్రధాని భారత్ రావాలంటే ముందుగా అనుకూల వాతావరణం ఏర్పడాలని.. అందుకు భారత్ తమ తొలి షరతును అంగీకరించాలని స్పష్టం చేశారు. 2024 ఆగస్టులో స్టూడెంట్స్ ఉద్యమం తదనంతర పరిణామాలతో దేశం విడిచి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే తమకు అప్పగించాలి. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆమెపై మానవ హక్కుల ఉల్లంఘన, నేరారోపణల కింద దోషిగా తేల్చిందని.. ఆమెతో పాటు భారత్‌లో తలదాచుకున్న ఇతర పరారీలో ఉన్న నేరస్థులను కూడా బంగ్లాదేశ్‌కు అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. హసీనాను తిరిగి ఇస్తేనే.. తారిక్ రెహమాన్ ఇండియా పర్యటన ఉంటుందని తేల్చి చెప్పింది.
ఇక బంగ్లాదేశ్ పెట్టిన రెండో కండిషన్ తమ దేశానికి చెందిన ఒక కీలకమైన విద్యార్థి నేత హత్యకు గురయ్యాడని, ఆ హంతకులకు ఇండియా షెల్టర్ ఇచ్చిందని బంగ్లాదేశ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ రెండో కండిషన్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ స్టూడెంట్ లీడర్ షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాడీ. ఆ తర్వాత జరగాల్సిన ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఆయన్ని.. 2025 డిసెంబర్లో ఢాకా వీధుల్లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. సింగపూర్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోవడంతో బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. ఆ హత్య చేసిన షూటర్లు అందరూ పారిపోయి ఇండియాలో తలదాచుకున్నారని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ హంతకులను ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం కింద వెంటనే బంగ్లాదేశ్‌కు అప్పగించాలన్నది బంగ్లాదేశ్ పెట్టిన రెండో కండిషన్. ఒకవేళ ఇండియా ఆ హంతకులను అప్పగించకపోతే, తమ ప్రధాని న్యూఢిల్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బంగ్లా విదేశాంగ శాఖ తెగేసి చెబుతోంది. ఈ రెండు కండిషన్స్‌పై భారత ప్రభుత్వం ఏ రకమైన సమాధానం ఇస్తుందా అని బంగ్లాదేశ్ ఎదురుచూస్తోంది.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఇంత అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవడం వెనుక ఈ నెల మొదటి వారంలో న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ మీట్ అని తెలుస్తోంది. ఆగస్టు 5న న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ లో షేక్ హసీనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, అక్కడకు వెళ్తే చనిపోతానని తెలిసి కూడా బంగ్లాదేశ్‌కు వెళ్లి తీరుతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బంగ్లాదేశ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఫస్ట్ అనే కొత్త విదేశాంగ విధానాన్ని తెరపైకి తెచ్చింది. సాధారణంగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఎవరున్నా వారి తొలి విదేశీ పర్యటన భారత్ లోనే ఉంటుంది. అయితే ఇటీవల తారిక్ రెహమాన్ ముందుగా మలేషియా, చైనాలలో పర్యటించారు. ఇప్పుడు హసీనాను అప్పగించాలి అంటున్నారు. ఒకవైపు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూనే.. మరోవైపు తమ సార్వభౌమాధికారం, గౌరవం విషయంలో వెనక్కి తగ్గేది లేదని బంగ్లాదేశ్ వాదిస్తోంది. భారత ప్రభుత్వం హసీనా వ్యాఖ్యలను ఎండార్స్ చేయడం లేదని ఇప్పటికే విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. మరి బంగ్లాదేశ్ వాదనకు భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.