రాబోయే 2027 సెన్సస్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా నూతన ప్రశ్నల పట్టికను సిద్ధం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా జనాభా లెక్కల సేకరణ దశకు 40 ప్రశ్నల షెడ్యూల్‌ను నోటిఫై చేసింది. గడచిన 2011వ సంవత్సరంలో జరిగిన లెక్కల సేకరణలో కేవలం 29 ప్రశ్నలు మాత్రమే ఉండటం గమనార్హం. కానీ ఈసారి జనాభా లెక్కల సేకరణలో ప్రశ్నల సంఖ్య పెరగడంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త షెడ్యూల్‌లో ప్రతి ఒక్కరి జాతీయత, తల్లిదండ్రుల వివరాలు, కులం, విద్య , నైపుణ్యాల గురించి ఆరా తీస్తున్నారు. వీటితో పాటు వ్యక్తిగత భాష, ఆధార్ వివరాలు , మొబైల్ నంబర్ వంటి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు. గతంలో ఎన్‌పీఆర్ రూపంలో సేకరించిన అనేక ప్రధాన అంశాలు ఇప్పుడు ఈ కొత్త షెడ్యూల్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.1955 నాటి పౌరసత్వ చట్టం సెక్షన్ 14 ఏ ప్రకారం కేంద్రం పౌరుల రిజిస్టర్ నిర్వహించాలి. అలాగే దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ప్రత్యేక జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేయాలనే నిబంధన చట్టంలో స్పష్టంగా ఉంది. సెన్సస్ ప్రక్రియ ద్వారా సేకరించే ఈ సమగ్ర డేటా అంతా భవిష్యత్తులో ఎన్‌పీఆర్‌కు ప్రధాన పునాదిగా మారుతుందని నమ్ముతున్నారు. ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ భవిష్యత్తు కార్యాచరణను స్పష్టంగా ప్రకటించారు. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ చేయని విప్లవాత్మక పనులు సాధిద్దామని పిలుపునిచ్చారు. డిజిటల్ సెన్సస్ సమయంలో దేశంలోని యువత తమ కుటుంబాలతో కలిసి స్వయంగా వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. సెన్సస్ ద్వారా దేశవ్యాప్తంగా పారదర్శకమైన డేటాను సేకరించి డిజిటల్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే అధికారికంగా మాత్రం ఎన్‌పీఆర్ లేదా దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీకి ఇంకా ఎలాంటి ముద్ర పడలేదని ప్రభుత్వం చెబుతోంది. సేకరిస్తున్న ఈ సెన్సస్ డేటా అంతా పూర్తిగా గోప్యంగా ఉంటుందని, కేవలం గణాంకాల కోసమే దీన్ని వాడుతామని స్పష్టం చేస్తున్నారు. చేపట్టబోయే సెన్సస్ ప్రక్రియే భవిష్యత్తు రాజకీయాలకు ప్రధాన రూపంగా మారుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం మరియు జాగ్రత్తగా పరిశీలించడం ఎంతైనా అవసరం. ప్రభుత్వం అడిగే ప్రతి ప్రశ్నకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పౌరులు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. రాబోయే రోజుల్లో ఈ జనాభా లెక్కల సేకరణ దేశ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులకు శ్రీకారం చుట్టనుందో వేచి చూడాలి.
imaginary picture