తెలంగాణలోని ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం , అలాగే ఆటో డ్రైవర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు లక్షలాది ఆటోల వైపు దృష్టి సారించింది. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026 అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో తిరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా ఏకంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ గా మార్చేందుకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఏకంగా 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ ప్రక్రియ త్వరలోనే క్షేత్రస్థాయిలో మొదలు కాబోతోంది.
ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా అనువుగా రూపొందించింది. ఆటో డ్రైవర్లు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునేలా ప్రధానంగా రెండు ఆప్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ ఏంటంటే.. పాత ఆటోను ఈవీగా మార్చుకోవడం. అంటే మీ దగ్గర ఉన్న పాత ఆటో ఛాసిస్‌ను అలాగే ఉంచి, అందులో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్‌ను తీసేసి, దాని స్థానంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన AIS-123 ప్రమాణాలు కలిగిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుతారు. ఇందులో డ్రైవర్లు తమ వీలును బట్టి ఫిక్స్‌డ్ బ్యాటరీ లేదా మార్చుకునే బ్యాటరీ విధానాన్ని ఎంచుకోవచ్చు. తక్కువ ఖర్చులో ఈవీకి మారాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ప్రభుత్వం ఇచ్చిన రెండో ఆప్షన్ చాలా ఇంప్రెస్సివ్ ఉంది. అదేంటంటే, మీ పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను పూర్తిగా స్క్రాప్ చేసి, దాని స్థానంలో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడం. ఇలా తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఈవీ ఆటో కొనే డ్రైవర్లను ప్రోత్సహించడానికి తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది.
కొత్త ఈవీ ఆటో కొనుగోలుపై ప్రతి ఒక్కరికీ ఏకంగా లక్షన్నర వరకు భారీ సబ్సిడీని అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సబ్సిడీ వల్ల కొత్త ఈవీ ఆటో కొనే డ్రైవర్లకు ఫైనాన్స్ భారం చాలా వరకు తగ్గుతుంది. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు భారీ లాభం చేకూరనుంది. రోజుకు వందల రూపాయలు ఇంధనం కోసం ఖర్చు పెట్టే బాధ పూర్తిగా తప్పుతుంది. ఎలక్ట్రిక్ ఆటోలకు కరెంట్ చార్జింగ్ ఖర్చు చాలా తక్కువ కాబట్టి, ఆ డబ్బులన్నీ మిగిలిపోయి డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే హైదరాబాద్ నగరానికి పర్యావరణపరంగా ఇది ఒక పెద్ద ఊరట. నగరంలో ప్రతిరోజూ వేలాది ఆటోల వల్ల వెలువడే వాయు కాలుష్యం , విపరీతమైన శబ్ద కాలుష్యం ఈ ఈవీ ఆటోల వల్ల చాలా వరకు తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం నగరవాసులకు అందుతుంది . మొత్తం మీద పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి తెలంగాణ సర్కార్ తెచ్చిన ఈ కొత్త ఈవీ కన్వర్షన్ స్కీమ్ నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.