ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖ మోటార్ రేసింగ్ మరియు కార్ల తయారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి వేదికగా మారుతుందనే అభిప్రాయాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, స్పోర్ట్స్ ఈవెంట్స్ వంటి వాటి వలన అక్కడ ఉన్న స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ రేసింగ్ పోటీలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు, టూరిస్ట్ లు రావడం వలన పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక ఈ మోటార్ స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తమిళనాడును అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్‌కు ఒక ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మరింత ఊతమిస్తుందని పలువురు భావిస్తున్నారు.
నేపాల్ వరదలు ఈ సంవత్సరంలోనే ప్రపంచం ఎదుర్కొన్న భారీ ప్రకృతి విపత్తుల్లో ఒకటి. ఊర్లకు ఊర్లు బురదలో కూరుకుపోయాయి, వందలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇంతటి ఘోర విపత్తులో జరిగిన ఒక అద్భుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరద నీరు, రాళ్లు, బురదతో కూరుకుపోయిన ఓ సొరంగంలో 9 రోజుల పాటు నరకం అనుభవించిన ఇద్దరు కార్మికులు.. ప్రాణాలతో సజీవంగా బయటపడడం అందరి మొహాల్లో సంతోషాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే నేపాల్ వరదలకు త్రిశూలి ప్రాజెక్టు టన్నెల్ మూసుకుపోయింది. లోపల ఉన్నవారు ఇక చనిపోయి ఉంటారని అందరూ భావించారు. అయితే మానవ ప్రయత్నం ఆ ప్రాణాలను రక్షించింది. భారీ వరదల కారణంగా త్రిశూలి 3A హైడ్రోపవర్ ప్రాజెక్టులోని టన్నెల్ లోకి పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు చేరి పూర్తిగా మూసుకుపోయింది. అందులో ప్రాజెక్టు మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్ ఫోర్మన్ సంజయ్ సాహ్ చిక్కుకుపోయారు. సరిగ్గా 9 రోజుల తర్వాత.. నేపాల్ ఆర్మీ నేతృత్వంలోని సంయుక్త భద్రతా బలగాలు ప్రత్యేక పరికరాలతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. శిథిలాలు క్లియర్ చేస్తుండగా లోపల నుంచి మెల్లిగా వారి వాయిస్ లు వినిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆర్మీ , ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అందిస్తూ అత్యంత సాహసోపేతంగా మొదట కబీర్‌ను, ఆ తర్వాత కొద్దిసేపటికే సంజయ్‌ను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. 9 రోజుల పాటు చీకటి గుహలో తిండి, నీళ్లు లేకుండా వారు ప్రాణాలతో బయటపడటం అద్భుతాన్ని తలపించింది.
ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో ఊహించని విధంగా వరద విలయతాండవం చేసింది. భారీ మంచు కొండలు, రాళ్లు ఒక్కసారిగా విరిగి నదుల్లో పడటంతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ విపత్తులో ఉత్తర, మధ్య నేపాల్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. తాజా అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రకృతి బీభత్సంలో మృతుల సంఖ్య ఏకంగా 1,282కు చేరుకుంది. భవనాలు కుప్పకూలడం, రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరో 4,798 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. నేపాల్ భద్రతా బలగాల సంయుక్త కమాండ్ ఆధ్వర్యంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల ప్రభావం నేపాల్‌లోని పాఠశాల విద్యార్థులపై అత్యంత దారుణంగా పడింది. విద్యా శాఖ ప్రాథమిక సమాచారం ప్రకారం.. రసువా జిల్లాలో సుమారు 280 మంది పిల్లలు, పొరుగున ఉన్న నువాకోట్ జిల్లాలో 300 నుంచి 350 మంది పిల్లలు వరద నీటిలో గల్లంతయ్యారు. ఒక్క బిదూర్ మున్సిపాలిటీలోనే 250 మందికి పైగా విద్యార్థుల ఆచూకీ దొరకడం లేదు. ఇక్కడ పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందంటే.. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఒకవైపు కన్నీరుమున్నీరుగా వెతుకుతుంటే, మరికొన్ని చోట్ల ప్రాణాలతో మిగిలిన పిల్లలు తమ అమ్మానాన్నల కోసం శిథిలాల మధ్య ఎదురుచూస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది కొట్టుకుపోయారు అన్న కచ్చితమైన లెక్కలు తీయడం కష్టంగా మారింది.వీరితో పాటు రసువా, నువాకోట్ జిల్లాల్లో కలిపి 22 మంది టీచర్లు, విద్యా సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ధాదింగ్, గోర్ఖా ప్రాంతాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు తీర్థయాత్ర కోసం వెళ్లి వరదల్లో చిక్కుకుని ఆచూకీ లేకుండా పోయారు. ఒకవైపు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడటం ఆ దేశానికి ఒక ఆశను ఇచ్చింది. కానీ, 1200 మందికి పైగా మరణించడం, 4,700 మందికి పైగా గల్లంతు కావడం.. నేపాల్ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద జాతీయ విషాదంగా మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా ఆ వందలాది మంది పిల్లల ఆచూకీ త్వరగా దొరకాలని, ఈ కష్టకాలంలో నేపాల్ త్వరగా కోలుకోవాలని యావత్ ప్రపంచం నేపాల్ కోసం ప్రార్థిస్తోంది.