విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అజిత్ ప్రశంసలు

Spread the love

తమిళ సినీ రంగంలో అజిత్, విజయ్ ఇద్దరూ సూపెర్ స్టార్స్ గా వెలుగొందిన నటులు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవం ఉంది. ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ప్రజామోదంతో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు అజిత్ కుమార్ సినిమాలు చేస్తూనే మోటార్ స్పోర్ట్స్ లో కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై అజిత్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఒక సీఎం విజయ్ కు ఒక లేఖను రాశారు.  తమిళనాడులో మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రశంసలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు యువతను క్రీడల వైపు ఆకర్షించి, వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, వాటిని క్రమబద్ధంగా పెంపొందించేందుకు అవకాశాలను కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు.  ముఖ్యంగా, తమిళనాడులో ప్రత్యేకంగా ఒక ‘మోటార్ స్పోర్ట్స్ సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం మోటార్ స్పోర్ట్స్ రంగంలో కొనసాగుతున్న ఒక వ్యక్తిగా, వ్యోమగామి శ్రీ నీల్ ఆమ్‌స్ట్రాంగ్ గారి ప్రసిద్ధ వ్యాఖ్యలను కాస్త మార్చి ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. “తమిళనాడు ప్రభుత్వం వేసిన ఒక చిన్న అడుగు, భారతీయ మోటార్ స్పోర్ట్స్‌కు ఒక మహత్తర పురోగతి.” గౌరవనీయ ముఖ్యమంత్రి C. జోసెఫ్ విజయ్ గారి ప్రయత్నాలన్నీ విశేష విజయం సాధించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోటార్ స్పోర్ట్స్ సిటీతో పాటు తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న అన్ని క్రీడా రంగానికి సంబంధించిన కార్యక్రమాలు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అజిత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా పేరున్న  ప్రముఖ మోటార్ రేసింగ్ మరియు కార్ల తయారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి వేదికగా మారుతుందనే అభిప్రాయాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. అలాగే   ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, స్పోర్ట్స్ ఈవెంట్స్ వంటి వాటి వలన అక్కడ ఉన్న స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి.  అంతర్జాతీయ రేసింగ్ పోటీలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు, టూరిస్ట్ లు రావడం వలన పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక ఈ మోటార్ స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తమిళనాడును అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్‌కు ఒక ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మరింత ఊతమిస్తుందని పలువురు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *