ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో అక్షరాస్యత శాతానికి సంబంధించి జగన్ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విమర్శలు సంధించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తికాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని NSSO నిర్వహించిన సర్వే ఆధారంగా PLFS (Periodic Labour Force Survey) 2023-24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 7 సంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018-19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023-24 నాటికి 72.6 శాతానికి చేరింది.అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య NSSO నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన PLFS క్యాలెండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 7 సంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమేనని అన్నారు. అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇక మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన UDISE గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిదని హితవు పలికారు. ఇక టీడీపీ నేతలు జగన్ కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.