నేపాల్‌ను మరోసారి భయపెడుతున్న వరద హెచ్చరికలు

Spread the love

గత నెలలో గ్లేషియర్ విరిగిపడి భారీ వరద ప్రభావంతో అతలాకుతలమైన నేపాల్ కు మరో ప్రమాదం పొంచి ఉంది. తాజాగా మరోసారి వరద హెచ్చరికలు జారీ కావడంతో నేపాల్ ను మరోసారి భయపెడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చౌలానీ నదీ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. కొండలపై నుండి పడిన రాళ్లు, మట్టితో నదీ ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆ రాళ్లు తొలగిపోతే ఒక్కసారిగా నదీ ప్రవాహం దిగువ ప్రాంతాలపై విరుచుకుపడే ప్రమాదం ఉందని  నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. 

గత నెలలో  హిమానీనదం అకస్మాత్తుగా కుప్పకూలడంతో చైనా సరిహద్దు ప్రాంతాలతో పాటు నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విలయం సృష్టించాయి.  ఈ ప్రమాదంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆ ప్రాంతం పూర్తిగా అతలాకుతలమైంది. హిమాలయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల గ్లేషియర్లు కరిగిపోవడం ఈ ఘోర  విపత్తులకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ విపత్తు ఆగస్టు 26వ తేదీన భోటే కోషి మరియు త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాలలో జరిగింది.  తెల్లవారుజామున హిమానీనదం విచ్ఛిన్నం కావడం వల్ల ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం ముంచెత్తింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఉప్పొంగిన ప్రవాహాలు గ్రామాలను చుట్టుముట్టాయి. సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలలో వందలాది నివాసాలు  పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఉప్పెన కారణంగా అప్పట్లో కేవలం 38 నిమిషాల వ్యవధిలో అధికారిక హెచ్చరికలు జారీ అయినప్పటికీ, ప్రవాహ వేగంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం దొరకలేదని స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య వేలల్లో ఉంది. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా, ఐదు జిల్లాల్లో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్ ప్రధాని బాలెంద్ర షా నేతృత్వంలోని ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఐరాస నష్టపరిహార నిధికి ప్రత్యేక అభ్యర్థన పంపింది. ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో నేపాల్ వాటా కేవలం 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ, పారిశ్రామిక దేశాల కాలుష్యం కారణంగా హిమాలయాలు ఈ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ప్రధాని బాలెంద్ర షా అంతర్జాతీయ వేదికలపై వాదిస్తున్నారు. భారతదేశం, చైనా మరియు అమెరికా వంటి దేశాలు అందించిన సాయానికి నేపాల్ ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. నేపాల్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి కేవలం ఆ దేశ సమస్య మాత్రమే కాదని  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల ప్రభావం హిమాలయాలపై ఎంత తీవ్రంగా ఉందో దానికి నిదర్శనమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇక అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, పటిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *