ప్రస్తుతం భారత్ లో ఒక చిన్న సినిమా గురించి సోషల్ మీడియా దగ్గర నుండి ప్రతిచోటా చర్చ జరుగుతోంది. కనీసం మొదటి రెండు వారాల్లో ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడిన వాళ్లు కూడా లేరు. థియేటర్ల దగ్గర హడావిడి లేదు, పెద్దగా ప్రమోషన్స్ లేవు. కానీ.. అదే సినిమా కొన్ని వారాల తర్వాత దేశం మొత్తం చర్చించుకునే రేంజ్ కు వెళ్ళిందివెళ్లింది. కేవలం 2 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మరో వంద కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. ఎలాంటి స్టార్ పవర్ లేకుండా, కేవలం కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆ సినిమానే హనుమాన్ అంష్. ఈ కథకు కేంద్రబిందువు నీమ్ కరోలి బాబా. ఆయన ఆధ్యాత్మిక, జీవిత చరిత్రను తెలియజేస్తూ తీసిన సినిమా ఇది. ఆయన ఎవరో కాదు. ప్రపంచలోని పెద్ద పెద్ద వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలు ఈయన భక్తులు. ఆపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు కూడా ఆయన భక్తులే. తమ జీవితంలో ఒక అస్థిరమైన పరిస్థితుల్లో ఉన్న వీరికి దారిచూపిన ఒకే ఒక్క మార్గదర్శకుడు నీమ్ కరోలి బాబా. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా అక్బర్పూర్ గ్రామంలో జన్మించిన లక్ష్మీ నారాయణ్ శర్మ అనే చిన్న బ్రాహ్మణ బాలుడే కాలక్రమేణా నీమ్ కరోలి బాబాగా అవతరించారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో విస్తరించింది. బాబాజీ తన యాత్రలో భాగంగా అనేక గ్రామాలు, అటవీ ప్రాంతాలు దాటుతూ గుజరాత్, మహారాష్ట్ర వంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. సాక్షాత్తు ఆంజనేయస్వామియే ఈ రూపంలో భూమిపైకి వచ్చారని భక్తుల నమ్మకం. అందుకే ఆయన్ని కలియుగ హనుమాన్ అని కూడా పిలుస్తుంటారు. బాబా తన జీవితకాలంలో భారతదేశం అంతటా దాదాపు 108 కు పైగా హనుమాన్ దేవాలయాలను నిర్మించారు. ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలను చూపించారని చెబుతుంటారు. డెవిట్ రోమ్ వంటి ప్రసిద్ధ రచయితలు బాబాజీ జీవిత చరిత్రను పుస్తకాలుగా మలిచి ప్రపంచానికి పరిచయం చేశారు. పశ్చిమ దేశాలలో ఉన్న భౌతికవాద సంస్కృతికి విసిగిపోయిన యువత, భారతీయ ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితులు కావడానికి నీమ్ కరోలి బాబా ప్రధాన కారణమయ్యారు. నీమ్ కరోలి బాబా 1973 సెప్టెంబర్ 11వ తేదీన భౌతిక శరీరాన్ని చాలించి దివ్యలోకానికి పయనమయ్యారు. ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా, ఆయన ప్రభావం మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ఆయన జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంష్’ సినిమా ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది రాసిన ‘డివైన్ డిటోర్: దట్ చేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ‘లక్ష్మీ నారాయణ్’ అనే యువకుడు, ఉత్తర భారతదేశంలో సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణం, ఆపై ఆయన నీమ్ కరోలి బాబాగా ఎలా మారారు అనే కథను ఇందులో అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కారణంగా రోజురోజుకూ థియేటర్ల సంఖ్య, వసూళ్లు ఊహించని రేంజ్లో పెరిగి పిల్లల నుండి వృద్ధుల వరకు కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి చూసేలా ఈ భక్తి రస చిత్రంగా నిలుస్తోంది. ఈ చిత్రంలో శోభినావ్ సత్యా, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు. భారతదేశంలో సాధించిన భారీ విజయంతో ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.