ఎల్ నినో ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా వర్షాకాలంలోనూ మండుతున్న ఎండలు

Spread the love

వర్షాకాలం నడుస్తున్నా చాలా ప్రాంతాల్లో వానల జాడ లేదు. ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతుండడంతో ఈ వర్షాకాలం వర్షాభావ స్థితిని ఎదుర్కొంటోంది. ఇక ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రుతుపవనాలు బలహీనపడి, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు ముప్పు, తీవ్రమైన వేడిగాలులు, వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే శీతాకాలం కూడా సాధారణం కంటే వేడిగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పసిఫిక్ మహాసముద్రపు ఉష్ణోగ్రతల అసాధారణ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఏడాది రుతుపవనాల సీజన్ ప్రారంభం నుండి వర్షాలు సాధారణంగా కురవలేదు. ప్రస్తుత సమయం వరకు దేశవ్యాప్తంగా రోజువారీ వర్షపాతంలో 24 శాతం లోటు నమోదైంది. అలాగే జూన్ 1 నుండి సెప్టెంబర్ 4 వరకు మొత్తంగా 13 శాతం లోటు కనిపిస్తోంది. ఆగష్టు  నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా సముద్ర మట్టాల ఆధారంగా చూస్తే సుమారు 14 శాతం మేర వర్షపాతం తగ్గింది. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే పడిపోతుందని, కరువు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసింది. భారత వాతావరణ విభాగం కూడా సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. జూన్ ప్రారంభంలో కేరళలో కాస్త ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు మరీ ఎక్కువగా ఉండడం కలవరపరిచే అంశం. ముఖ్యంగా మేఘాలయలో జూన్ 1 నుండి సెప్టెంబర్ 1 మధ్య కాలంలో ఏకంగా 58 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఇక దక్షిణ భారతదేశానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ లో కూడా  పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆగస్టు నెలాఖరు నాటికి రాష్ట్రంలో సంచిత వర్షపాత లోటు దాదాపు 45 శాతానికి చేరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, కొన్ని ప్రాంతాల్లో ఇది తీవ్ర రూపం దాల్చిందని వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. అనుకున్న  సమయానికి వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు సాగునీరు అందక మొలక దశలోనే ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో తాగునీటి సమస్య కూడా తలెత్తుతోంది. రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కరువు పరిస్థితుల వల్ల వరి సాగు విస్తీర్ణం లక్షలాది ఎకరాలు తగ్గిందని, రైతులు ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల వైపు మొగ్గుచూపుతున్నప్పటికీ పెట్టుబడుల భారంతో ఇబ్బంది పడుతున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.వాతావరణ మార్పుల పట్ల ఇప్పటి నుండే  స్పష్టమైన ప్రణాళిక అవసరం. నీటి వనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాబోయే నెలల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.  దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం భూగర్భ జలాలను  పునరుద్ధరించడం, చెరువుల పూడికతీత పనులను త్వరితగతిన  చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *