వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగే వన్డే, టీ 20 సిరీస్ లకు అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లు ఎంపిక కాలేదు. సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. వీళ్లిద్దరికీ టీ20ల్లోనూ అవకాశం దక్కలేదు. నమన్ ధీర్, ఆకిబ్ నబి మొదటిసారిగా భారత వన్డే జట్టులో స్థానం దక్కించారు. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా వన్డే, టీ 20లలో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు విండీస్ వన్డే, టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం అఫ్గాన్ సిరీస్ ఆడుతున్న బుమ్రా త్వరలో ఆసియా క్రీడల్లో ఆడనున్నాడు. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఆసియా క్రీడల్లో తలపడనున్న టీ20 జట్టునే దాదాపుగా విండీస్ సిరీసుకు కొనసాగించారు. ఈ నెల 27 నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. తర్వాత అయిదు టీ20ల సిరీస్ జరుగుతుంది.
భారత వన్డే జట్టు:
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుర్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబి, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శివమ్ దూబె, కుల్దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్, అర్షీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్.
ఈ వన్డే సిరీస్కు అసలైన కిక్ ఇచ్చే మరో విషయం ఏంటంటే… మైదానంలో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, ‘కింగ్’ విరాట్ కోహ్లీ జోడీ కలిసి కనిపించనుండడం కూడా. వీరిద్దరూ జట్టులో ఉన్నారంటే గ్రౌండ్లో జోషే వేరు. రోహిత్ శర్మ తన క్లాస్ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్ల మైండ్ బ్లాక్ చేస్తుంటే, మరోవైపు విరాట్ కోహ్లీ తన అద్భుతమైన షాట్లతో అలరిస్తాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే వచ్చే మజానే వేరు. నిజం చెప్పాలంటే, టీమిండియా మ్యాచ్ లను కేవలం క్రికెట్ పై ప్రేమతో మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా కోహ్లీ, రోహిత్ కోసమే టీవీలకు అతుక్కుపోయే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.అలాంటి వీరాభిమానులకు ఈ సిరీస్ ఒక పెద్ద పండుగ లాంటిది.అలాగే దూకుడుగా ఆడే యువ ఆటగాళ్ళు ఒకవైపు, అనుభవజ్ఞులైన రోహిత్-కోహ్లీల భాగస్వామ్యం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో జట్టు పటిష్టంగా ఉంది. ఇలా ప్రతి విభాగంలోనూ టీమిండియా రాణిస్తే వెస్టిండీస్ పై మరోసారి మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.