భారతదేశ రాజకీయ చరిత్రలో ఎందరో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఒక నాయకుడు దశాబ్దాల పాటు ఒక రాష్ట్రాన్ని, ఆ తర్వాత యావత్ దేశాన్ని ఏకధాటిగా శాసించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సెప్టెంబర్ 17.. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోదీ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో మరే నాయకుడికీ సాధ్యంకాని ఒక భారీ రికార్డును మోదీ తన పేరిట లిఖించుకున్నారు. . సాధారణంగా ఒక నాయకుడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయితేనే అదొక పెద్ద విషయం. అయితే నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, అలాగే మన దేశ ప్రధానమంత్రిగా.. రెండూ కలుపుకుని ప్రభుత్వాధినేతగా కంటిన్యూస్ గా ఏకంగా 25 సంవత్సరాల మైలురాయిని చేరుకోబోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే 2001 అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి మోదీ ప్రమాణస్వీకారం చేశారు. అక్కడి నుంచి దాదాపు 12 సంవత్సరాల 8 నెలల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన తిరుగులేని పాలన అందించారు. ఆ తర్వాత 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అంటే 12 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. అంటే రాబోయే అక్టోబర్ 7 వస్తే, ఒక ఎలెక్టెడ్ ప్రభుత్వానికి అధినేతగా సీఎం,పీఎం కలుపుకుని మోదీ సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. రోజుల్లో లెక్కపెడితే ఆయన ఇప్పటి వరకు ప్రభుత్వ అధినేతగా 9104 రోజులు పూర్తి చేసుకున్నారు. ఒక ప్రభుత్వానికి అధినేతగా ఇండియాలో ఇన్ని వేల రోజులు పనిచేసిన రికార్డు గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఇప్పుడు ఆల్ టైమ్ హై రికార్డును ప్రధాని మోదీ తన పేరిట లిఖించుకున్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు, అది కూడా బలమైన ప్రతిపక్షాలు ఉన్న కాలంలో, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అధికారంలో కొనసాగడం అనేది భారత రాజకీయాల్లో ఒక అద్భుతం. స్వాతంత్య్రం అనంతరం జన్మించి మన దేశానికి ప్రధాని అయిన మొట్టమొదటి నాయకుడిగా కూడా మోదీ రికార్డు క్రియేట్ చేశారు.
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అతిపెద్ద మైలురాయి నెహ్రూ రికార్డును బ్రేక్ చేయడం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అయితే నెహ్రూ తొలిసారి ప్రధాని అయినప్పుడు, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడలేదు , ఆయన అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండి సెలెక్ట్ కాబడ్డ ప్రధాని మాత్రమే. ఆ తర్వాత 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో నెహ్రూ ని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత 1957, 1962లో వరుసగా మూడు సార్లు విజయం సాధించి 1964 లో కన్నుమూసేంత వరకు ఆయనే ప్రధానిగా ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా దేశంలో బలమైన ప్రతిపక్షం కూడా లేదు.అయితే, నెహ్రూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానిగా దేశానికి 4,398 రోజులు కంటిన్యూస్ గా కొనసాగారు. ఇన్నేళ్ల భారత దేశ చరిత్రలో ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ప్రధానులైనా నెహ్రూ రికార్డు బ్రేక్ కాలేదు. కానీ ఈ ఏడాది జూన్ 10వ తేదీతో ప్రధాని మోదీ ఆ 4,398 రోజుల నెహ్రూ ఆల్ టైమ్ రికార్డును అధిగమించి, సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా మోదీ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. పైగా నెహ్రూ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో పూర్తి కాలం నెగ్గిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా మోదీ చరిత్ర తిరగరాశారు.
కేవలం అధికారంలో ఉండటమే కాదు, తన నిర్ణయాలతో దేశ గతిని మార్చిన ప్రధానిగా మోదీకి పేరుంది. ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కూడా దేశాన్ని సరికొత్త దిశగా నడిపాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజుల్లోనే కోట్ల మందికి జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాలు తెరిపించారు. 122 రోజులకు భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలని, మేక్ ఇన్ ఇండియా అంటూ దేశాన్ని పరుగులు పెట్టించారు. 401 రోజుల్లో డిజిటల్ ఇండియా కలను సాకారం చేశారు. ఈరోజు మనం వాడుతున్న యూపీఐ లావాదేవీలు ప్రపంచ దేశాలకే దిక్సూచిగా నిలిచాయి. . ఆ తర్వాత జీఎస్టీ అనే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని సాహసోపేతంగా అమలు చేశారు. ఇక పెద్ద నోట్ల రద్దు లాంటి నిర్ణయాలతో సరికొత్త చరిత్ర సృష్టించారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 , 35A ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా భారత్ లో అంతర్భాగం చేశారు. అలాగే దశాబ్దాలుగా నలుగుతున్న రామజన్మభూమి వివాదానికి ముగింపు పలికి, అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇక పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ తో దేశంలో ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఉగ్ర మూకల వెన్నులో వణుకుపుట్టించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద కోట్లాది మరుగుదొడ్లు కట్టించి రికార్డు సృష్టించారు.
మూడోసారి ప్రధానిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. దేశంలో వందే భారత్ , వందే అమృత్ భారత్ లాంటి అత్యాధునిక రైళ్లతో ఇండియన్ రైల్వేస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మారుస్తున్నారు. అలాగే, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణల పై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, మూడో టర్మ్ లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కఠినమైన బిల్లులను ముందుకు తీసుకువెళ్తూ పటిష్ట నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత దేశాన్ని, ఈ 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో భారత్ ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్నది మోదీ ముందున్న అతిపెద్ద లక్ష్యంగా పయనిస్తున్నారు. నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం , ఆ ప్రయాణంలో బద్దలైన చారిత్రక రికార్డులు. కొందరు ఆయన నిర్ణయాలను విమర్శించవచ్చు, మరికొందరు ఆయన్ని ఆరాధించవచ్చు. కానీ భారత దేశ రాజకీయ పటంలో నరేంద్ర మోదీ అనే ఒక బలమైన నాయకుడి ముద్ర మాత్రం చెరిపేయలేనంతగా పడిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదనేది మెజారిటీ ప్రజల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయం.