భూ దోపిడీకి పాల్పడిన ఘటనలపై సమగ్ర విచారణ:సీఎం రేవంత్

Spread the love

భూములను అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని SET  ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం రేవంత్  సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. భూములకు సంబంధించి ప్రధానంగా నాలుగు రకాల సమస్యలు కాలక్రమేణా తలెత్తాయని వివరించారు. జరిగిన భూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భూ సమస్యల వరకు వివిధ అంశాలను రేవంత్ వివరించారు. 1908లో ప్రారంభమైన భూ రికార్డుల నుంచి 2011 వరకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు, వాటి వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1954-55లో వచ్చిన కాస్రా పహానీ, 1955లో ఇనాం భూముల చట్టం రద్దు, వినోబా బావే భూదానోద్యమం, 1965లో తీసుకొచ్చిన చట్టం, గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి 1/70 యాక్ట్, 1989లో కొత్త ఆర్వోఆర్ చట్టం, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విధానం వంటి అంశాలను వివరించారు. భూములు అతికొద్ది మంది చేతుల్లో చిక్కుకున్న  నేపథ్యంలో 1973లో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఆ తర్వాత 1977లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా బదలాయింపును నిషేధించే చట్టం వచ్చిందని తెలిపారు. పోడు భూముల విషయంలో ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు 2006లో యూపీఏ ప్రభుత్వం ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన విషయాన్ని కూడా రేవంత్ లేవనెత్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో ధరణి  పోర్టల్ తీసుకొచ్చే వరకు జరిగిన పరిణామాలను కూడా సీఎం వివరించారు. 2018లో ధరణి విధానం కోసం ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని, అక్కడి నుంచి టెరాసిస్, ఫాల్కన్ ఎస్ జి హోల్డింగ్స్.. ఇలా కంపెనీలు చేతులు మారాయన్నారు. తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సుమారు 2.50 కోట్ల ఎకరాల భూముల రికార్డులు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, యజమానుల ఫోన్ నంబర్లతో సహా కామెరాన్ హైలాండ్స్‌కు తరలించిన విధానం జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా రికార్డులన్నీ విదేశీ శక్తుల చేతుల్లో పెట్టారని సీఎం ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ కబ్జాలను నిరోధించేందుకు 1982 జూన్‌లో ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పటి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ప్రైవేటు భూములకు సంబంధించి 3,73,930 ఎకరాలపై వివాదం ఉందన్నారు.  ప్రజల భూములను కాపాడటంతో పాటు భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు 2025లో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ధరణి పేరుతో జరిగిన అక్రమాలను నిరోధించి ప్రజల ఆస్తులను రక్షించేందుకు అన్ని వర్గాలతో, అన్ని స్థాయిల్లో చర్చించి, అంశాలను పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టి సమగ్ర ప్రక్షాళన దిశగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. నిషేధిత భూములకు సంబంధించి 22ఏ సెక్షన్‌ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని కూడా స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే 1999లో తొలిసారిగా సెక్షన్ 22ఏను తీసుకొచ్చారని తెలిపారు. భూదాన, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములను రక్షించడమే దీని ఉద్దేశమని చెప్పారు. 

2020 అక్టోబర్‌లో 7,91,542 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా తమ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విస్తీర్ణాన్ని 3,73,930 ఎకరాలకు తగ్గించినట్లు తెలిపారు. అలాగే పార్ట్-బీలోని వివాదాస్పద భూములను 17 లక్షల ఎకరాలకు తగ్గించామని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితాను గత డిసెంబర్‌లోనే అప్‌డేట్ చేసినప్పటికీ చాలామంది ఈ విషయాన్ని గమనించలేదన్నారు.నిషేధిత జాబితాకు సంబంధించి ప్రధానంగా ఎనిమిది అంశాలకు పరిష్కారం అవసరం ఉందని స్పష్టతనిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే నిషేధిత జాబితా కొనసాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూములను జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. ఇకపై ఏదైనా భూమిని 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చాలంటే సంబంధిత కలెక్టర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. దేవాదాయ, వక్ఫ్ రికార్డులను పరిశీలించి భూముల స్థితిని నిర్దారించనున్నట్లు తెలిపారు. వాటిలో కొంత భాగం మాత్రమే వివాదాస్పదంగా ఉంటే ఆ భాగాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో కొనసాగించి, మిగిలిన భూమిని జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నిరుపేదలకు చెందాల్సిన లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, భూముల దోపిడీని క్షమిస్తే భావి  తరాలు క్షమించవని ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడిన వ్యవహారాలను ప్రభుత్వం ఉపేక్షించబోదని సీఎం రేవంత్  స్పష్టం చేశారు. అలాంటి అన్ని వ్యవహారాలను ప్రత్యేక విచారణ బృందానికి రిఫర్ చేస్తామని, భూ దోపిడీకి పాల్పడిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సభలో ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *