కర్ణుడిగా లారెన్స్..పాన్ ఇండియా రేంజ్ లో మహావీర్ కర్ణ

Spread the love

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో  ఇప్పుడు మైథలాజికల్ సినిమాల హవా కొనసాగుతోంది.  మన ఇతిహాసాలు, పురాణాల ఆధారంగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వచ్చిన  కల్కి సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో మరొక భారీ ఇతిహాస చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే మహాభారతం నేపథ్యంగా, అందులోని అత్యంత పవర్ ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్ అయిన కర్ణుడు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం మహావీర్ కర్ణ.  ప్రముఖ నటుడు, డాన్స్ మాస్టర్,  డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ ఈ సినిమాలో కర్ణుడిగా కనిపించనున్నారు. ముని, కాంచన లాంటి హారర్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించిన లారెన్స్ ఇప్పుడు ఏకంగా ఒక పౌరాణిక పాత్రలో సినిమాలో కనిపించనున్నారు. డైరెక్టర్ రమేష్ వర్మ మహావీర్ కర్ణ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ అఫీషియల్ గా పంచుకున్నారు. ఈ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమంటూ రాఘవ లారెన్స్ స్వయంగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను తన సోషల్ మీడియాలో పెట్టారు. మన పురాణాల్లో అత్యంత గొప్ప వ్యక్తిగా, మహా యోధుడిగా కీర్తించే కర్ణుడి పాత్రను పోషించే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాత్రకు నన్ను నమ్మి ఎంచుకున్నందుకు దర్శకుడు రమేశ్‌ వర్మకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. మరి లారెన్స్ లాంటి ఒక మాస్ హీరో, ఇలాంటి ఒక పురాణ పాత్రను పోషించి ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. 

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో అంటే 2027 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లారెన్స్ బ్రాండ్ ఇమేజ్ కు రమేష్ వర్మ టేకింగ్ తోడైతే, ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్న లారెన్స్  ఇప్పుడు ఒక ఎపిక్ పౌరాణిక యోధుడిగా మారడం నిజంగా ఒక ప్రయోగం అనే చెప్పాలి. మరి ఈ ప్రయోగం పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అనేది సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *