ఉపాసన కామినేని కొణిదెల. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా మాత్రమే కాకుండా, ఒక పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను ఆమె క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే అపోలో లైఫ్ వ్యవహారాలు విజయవంతంగా చూసుకుంటున్న ఉపాసనకు, ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ఒక అత్యంత కీలకమైన బాధ్యతను అప్పగించింది. అపోలో హాస్పిటల్స్ న్యూ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా ఉపాసన తాజాగా నియమితులయ్యారు. ఉపాసన అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆమె సేవా దృక్పథం, వ్యాపార లక్షణాలు, నాయకత్వ పటిమ. గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ వారసత్వాన్ని మాత్రమే నమ్ముకోకుండా, తన సొంత టాలెంట్ తో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ కు ముడిపడి ఉన్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో ఉపాసన ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం లాంటివి ఆమె ఎప్పటినుంచో చేస్తోంది. అలాగే యువర్ లైఫ్ అనే వెల్నెస్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఎన్నో విభాగాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె ఇప్పుడు అపోలో గ్రూప్ అత్యున్నత పదవిని అందించింది. రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో దేశవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసిన అపోలో హాస్పిటల్స్ కొత్త ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా ఉపాసనను నియమించారు. ఆమె అపోలో హాస్పిటల్స్ భవిష్యత్ ప్రణాళికలను, కొత్తగా చేపట్టబోయే భారీ ప్రాజెక్టులను పర్యవేక్షించబోతున్నారు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కు భార్యగా అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూనే, పిల్లల బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటోంది. ఇదే సమయంలో ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం అనేది నిజంగా నేటి తరం మహిళలందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే, తన ప్రొఫెషనల్ బాధ్యతల్లో కూడా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడు టెక్నాలజీ పాత్ర ఎంతో కీలకమైనది. అపోలో హాస్పిటల్స్ ను ప్రపంచస్థాయిలో మరింత ముందుకు తీసుకువెళ్లడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్ సర్జరీ లాంటి సరికొత్త టెక్నాలజీలను భారతీయ వైద్యంలో వినియోగించడానికి ఈ న్యూ ప్రాజెక్ట్స్ విభాగం ఎంతో కీలకంగా పనిచేస్తుంది. ఈ విభాగానికి ఇప్పుడు ఉపాసన హెడ్ గా సేవలందించనున్నారు. తాతకు తగ్గ మనవరాలిగా, మెగా ఇంటికి తగ్గ కోడలిగా ఉపాసన అటు వ్యాపారంలోనూ, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న తీరుపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.