రోజులు చకచకా పరిగెడుతున్నాయి. సెప్టెంబర్ ముగిసిపోతోంది. అక్టోబర్ వచ్చేస్తోంది. ఆర్థిక మరియు రోజువారీ నిర్వహణ పరంగా కూడా అక్టోబర్ నెల ఎంతో కీలకమైనది. ఈ కొత్త నెల ప్రారంభంతో బ్యాంకింగ్ నిబంధనలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్ నియమాలు మరియు పన్ను చెల్లింపుల గడువుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి వస్తాయి. అలాగే సంవత్సరం చివరి త్రైమాసికానికి అడుగుపెడుతున్న వేళ, మన వార్షిక లక్ష్యాలను రివ్యూ చేసుకోవడానికి మరియు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనువైన సమయం. మరి ఈ అక్టోబర్ లో రానున్న మార్పులు ఏంటో చూద్దామా
ముందుగా ఎల్పీజీ ధరలను చూసుకుంటే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి నెలా మొదటి తేదీన గృహ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. సెప్టెంబర్ నెలలో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ.. కమర్షియల్ సిలిండర్ ధర స్వల్పంగా (రూ.10)గా పెంచాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలను సవరించే అవకాశం ఉంది. మరి చూడాలి పెంచుతాయా లేదా అనేది. ఇక ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథంటికేషన్ (E-KYC) ప్రాసెస్ ను సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక గడువు దాటితే రాయితీ వర్తించదు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అడ్డుకట్ట వేయడంతో పాటు రాయితీ దుర్వినియోగం కాకుండా ఉండడానికి ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. ఆయిల్ కంపెనీల యాప్, గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ డీలర్ల వద్ద నెలాఖరులోపు ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికీ చేయనివారు ఎవరైనా ఉంటే పూర్తి చేసుకోవాలి. ఇక గత పదేళ్లుగా చెల్లింపులలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తూ చిల్లర కొరతకు చెక్ పెట్టిన యూపీఐ సేవలలో మార్పులు ఉండనున్నాయి. ఇన్నాళ్లూ ఉచితంగా ఆనందించిన యూపీఐ లావాదేవీలపై ఇకపై ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబరు 15 నుండి రూ.2000 పైబడిన లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) అమలు కానుంది. అయితే చిన్న చిన్న వ్యాపారులకు, వ్యక్తులు చేసే లావాదేవీలకు వీటి నుండి మినహాయింపు ఉండడం విశేషం. పెట్రోల్ బంకులు, ఇన్సూరెన్స్ వంటి చెల్లింపులకు ఫ్లాట్ ఎండీఆర్ రూ.5 వర్తిస్తుంది.ఇక బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటే రూ. 3కోట్లు అంతకు మించిన భారీ డిపాజిట్లపై వడ్డీ రేట్లను వెల్లడించే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. అక్టోబరు 1 నుండి ఈ మాదిరి డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రతి రోజూ ఉదయం 10 గంటలకల్లా తన వెబ్సైట్లో పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఒకే తేదీన స్వీకరించిన డిపాజిట్లపై వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు బ్యాంకులు కస్టమర్ల మధ్య గానీ, బ్రాంచీల మధ్య గానీ వివక్ష చూపకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలా అక్టోబర్ లో వస్తున్న మార్పులు గమనించుకొని దానికనుగుణంగా ప్రణాళికలు చేసుకోండి.