ఒకవైపు ‘విశ్వంభర’, ‘కాకా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ యుగంలో ఆయన కూడా ఒక ప్రముఖ ఓటీటీ వేదికగా అభిమానులను అలరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 48 ఏళ్లకు పైగా సినిమా కెరీర్ లో ఎన్నో అద్భుత పాత్రలతో ఆకట్టుకున్న ఆయన తొలిసారిగా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ వీక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ షోను సదరు ఓటీటీ సంస్థ గ్లోబల్ స్టేజ్‌పై ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. ఈ టాక్ షోలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర నటీనటులు, ప్రముఖులు అతిథులుగా పాల్గొని చిరంజీవితో సంబాషించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి స్టార్ మా ఛానల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ (సీజన్ 4) షోకు హోస్ట్ గా అలరించారు. తెలుగు అగ్ర సీనియర్ నటులు బాలకృష్ణ (అన్‌స్టాపబుల్), నాగార్జున (బిగ్‌బాస్), వెంకటేష్ (రానా నాయుడు) ఓటీటీ/డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చిరు కూడా ఆ బాటలోనే పయనిస్తున్నారు. దీనిపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ ఓటీటీ లో కూడా తనదైన హవా చూపిస్తారని ఈ షో కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై రోజు రోజుకు కొత్త కంటెంట్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి షోలకు క్రేజ్ ఏర్పడుతోంది. ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఎప్పటికప్పడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ కూడా ఓటీటీ లోకి వస్తారనే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.