
నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మోసాలూ ఈజీగా పెరిగిపోతున్నాయి. ఇవి అటు ఆర్థికంగా, సామాజిక భద్రతకు రెండిటికీ భంగం కలిగిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఎయిర్‌టెల్ సంస్థ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా మోసపూరిత వెబ్‌సైట్‌లను అప్పటికప్పుడు బ్లాక్ చేసేందుకు ఏఐ ఆధారిత సేఫ్టీ సిస్టమ్ ను తీసుకొచ్చింది.
ఇది స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇంటర్నెట్ సేవలకూ రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం అడిషనల్ గా ఎటువంటి రుసుము లేదా డబ్బులు పే చేయాల్సినవసరం లేదు. మ్యానువల్‌గా ఎనేబుల్ చేసుకోవాల్సిన పనీ లేదు. ఇలాంటి రకం సర్వీసులను అందిస్తున్న వాటిలో ప్రపంచంలోనే ఇది మొదటిగా నిలుస్తున్నట్లు ఎయిర్ టెల్ చెప్పుకొస్తుంది. ప్రస్తుతానికి ఇది హరియాణాలో అందుబాటులో ఉంది. త్వరలోనే దేశమంతటా విస్తరిస్తున్నట్లు సమాచారం!
ఇది వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఈ-మెయిల్స్, బ్రౌజర్స్, ఎస్సెమ్మెస్ వంటి కమ్యూనికేషన్ అన్నిటిలో పనిచేస్తుంది.
ఎయిర్‌టెల్‌కు చెందిన ఒక మల్టీలెవల్ సర్వెలైన్స్ సిస్టమ్ అనేది ఏఐ సాయంతో ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను ఫిల్టర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ముప్పులను సైతం ఇది తనిఖీ చేస్తుంది. ఎయిర్‌టెల్ సమాచార నిధిలో అప్పటికే ఉన్న మోసగాళ్ల సమాచారంతో ఇది సరి చూసుకుంటుంది. అందువల్ల యూజర్లు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఫ్లాగ్ చేసిన వెబ్‌సైట్‌లను వినియోగదారులు యాక్సెస్ చేయటానికి ప్రయత్నిస్తే ఆ పేజీని బ్లాక్ చేస్తుంది కూడా. నోటిఫికేషన్ రూపంలో దానికి కారణాన్నీ కూడా తెలియజేస్తుంది.