కల్వకుంట్ల కవిత దారెటు?

Spread the love

ఎమ్మెల్సీ కవిత దారెటు..? ఆమె నిజంగానే ఆ లేఖ రాశారా..? తండ్రి కేసీఆర్ ను ప్రశ్నించే పరిస్థితి ఉందా..? బీ ఆర్ ఎస్ ను కాదని కొత్త పార్టీ పెడతారా..? అసలు కవిత అసంతృప్తి వెనకాల కారణాలేంటి? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్

బీఆర్ఎస్ పార్టీలో కొన్నాళ్లుగా గూడు కట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసినట్టుగా బయటకు వచ్చిన లేఖ గులాబీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. సొంత పార్టీ వ్యవహార శైలిపై, కన్న తండ్రి తీరుపై ఆమె సంధించిన ప్రశ్నల వర్షం రాజకీయ ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లయింది. అసలు కవిత సొంత పార్టీపై ఎందుకు తిరుగుబాటు చేశారు? కన్న తండ్రినే ప్రశ్నిస్తూ ఎందుకు లేఖాస్త్రం సంధించారు? పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖ బయటకెలా వచ్చింది? కావాలనే లీక్ చేశారా? కవితను పొమ్మన లేక పొగ బెడుతున్నారా? లేక పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని కవితనే ఆవేదన వెల్లగక్కారా? లేక సొంత కుంపటి పెట్టుకోవడానికే తిరుగుబావుటా ఎగురువేశారా? ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నలివి.

ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన ఆమె తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ ఉర్దూ లో అనర్గళంగా మాట్లాడగలిగిన విశిష్ట నాయకురాలు. తన వాగ్ధాటితో పాటు వివిధ అంశాలపై ఆమెకు మంచి పట్టుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను కదిలించడంలో కేసీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, బీఆర్ఎస్ పాలనలోనూ కవిత తనదైన ముద్ర వేశారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత సొంతంగా ఎదిగారు. కనుమరుగైపోతున్న బతుకమ్మను బతికించిన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో మన సంస్కృతి సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఉద్యమానికి కొత్త రూపు తీసుకురావడంలో బతుకమ్మ ఎంతో కీలకంగా మారింది. ఒకనాడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ విశిష్టతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పడంలో కవిత కృషి ఎంతో ఉంది. కవిత అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే కవిత అన్న రీతిలో ప్రచారం జరిగింది.

తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో బతుకమ్మకు విశిష్ట స్థానం దక్కింది. స్వరాష్ట్రంలోనూ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడం వెనుక కవిత కృషి ఉందని చెప్పాలి.. ఊరూవాడ తిరుగుతూ బతుకమ్మలు పేర్చుతూ మహిళా లోకాన్ని ఏకం చేసిన నాయకురాలిగా ఆమెకు మంచి పేరొచ్చింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత బీఆర్ఎస్ అధికారం చేపట్టాక కవితకు విశేష ప్రాధాన్యం దక్కింది. నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆమె.. పసుపుబోర్డు సహా వివిధ అంశాలపై కేంద్రంపై పోరాడారు. తొలి ఐదేళ్లు తనదైన శైలిలో రాజకీయాల్లో రాణించారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆమె మాటకు తిరుగు లేకుండా పోయింది. అయితే, ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కవిత ఓడిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆమె ఓటమిని మూటగట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

అప్పటికే ప్రభుత్వంలో బలమైన నేతగా ఎదిగిన కవిత.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చేతులు కలిపి లిక్కర్ స్కాం లో ఇరుక్కున్నారు.. ఈ కేసులో కవిత అరెస్టు కావడం బీఆర్ఎస్ కు మింగుడు పడలేదు. మద్యం కుంభకోణంతో ఆమె ఇమేజ్ దారుణంగా పడిపోయింది.. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ కవితను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది.. కేటీఆర్ ను రాజకీయ వారసుడిగా బలంగా ముందుకు తీసుకొచ్చిన కేసీఆర్.. కవితకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారని గులాబీ శ్రేణులే చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో అరెస్టై జైలుకు వెళ్లిన కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్.. బీజేపీ ముందు చేతులు చాచాల్సి వచ్చిందని చెబుతారు. అందుకే మొదట్లో కాషాయ పార్టీపై రుసరుసలాడిన ఆయన.. కవిత ఉదంతం తర్వాత బీజేపీపై విమర్శల దాటిని తగ్గించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, తనను జైలుపాలు చేసిన బీజేపీపై గుర్రుగా ఉన్న కవితకు.. బీఆర్ఎస్ మౌనం మరింత అసహనం కలిగించిందని టాక్. ఒకవైపు పార్టీలో ప్రాధాన్యం తగ్గించడం, నాయకులతో యాక్సెస్ కట్ చేయడం తన ఆశలకు వ్యతిరేకంగా పార్టీ వెళ్తుందటం పట్ల తీవ్ర అసంతృప్తిని లోనవుతున్నారట..

బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొంతకాలంగా పోరాటం చేస్తున్న కవితకు పార్టీ నుంచి మద్దతు కరువైంది. ఇదే అంశాన్ని ఆమె తన తండ్రికి రాసినట్టుగా బయటకు వచ్చిన లేఖలో ఎత్తిచూపారు. పార్టీ శ్రేణులతో తనకు యాక్సెస్ లేకుండా చేస్తుండడాన్ని ఆమె ప్రశ్నించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా నొచ్చుకున్న కవిత.. తిరుగుబావుటా ఎగురవేశారు. తన తండ్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కవిత దారెటు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సొంత పార్టీలో ఇమడలేక పోతున్న ఆమె.. కొత్త పార్టీ పెట్టుకుంటారన్న చర్చ కూడా జరుగుతోంది.. కొత్త పార్టీ ద్వారా జనాల్లోకి వెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేస్తూ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, పార్టీని స్థాపించినప్పటికీ, దాన్ని నడపడం అంత ఈజీ కాదన్న విషయాన్ని కవిత గుర్తించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.