భారత్ లో కరోనా వ్యాప్తి పెరుగుతుందా? అప్రమత్తత అవసరం..

Spread the love

మే 2025 మొదటి వారంలో ఇండియాలో 28 కరోనా కేసులు నమోదు కాగా, ఆ తరువాత వారంలో కరోనా కేసుల సంఖ్య 41కి పెరిగాయి. మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదవ్వగా, ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీలోని విశాఖ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా, గత సెప్టెంబర్ నుంచి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు క్రమంగా తగ్గాయని, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం భారత్ లో తక్కువగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్యశాఖాధికారులు అంటున్నారు.

కానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.

బూస్టర్ డోస్ తీసుకోనివారు ఇప్పుడైనా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని, అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రభావం ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే జాగ్రత్తలు మనకు శ్రీరామ రక్ష అవుతాయని గ్రహిస్తే మేలు.