
Nandamuri Taraka Rama Rao: శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణ, భీష్మ.. వంటి పౌరాణిక పాత్రలు పోషించి.. ఆయా పాత్రలకే వన్నె తెచ్చిన గొప్ప నటులు.. తారక రాముడు..
ప్రతి తెలుగు లోగిళ్ళలో, వారి మనసుల్లో నటుడిగానే కాక అన్నగా కొలువుదీరిన నందమూరి తారక రామారావుగారు.. 44 ఏళ్ళపాటు సుధీర్ఘ సినీ ప్రస్థానాన్ని సాగించి దాదాపు 300 సినిమాల్లో నటించి, కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఆపై విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితులయ్యారు.
అటువంటి శక పురుషుడి జీవితానికి సంబంధించిన వ్యక్తిగత,
సినీ విశేషాలను ఈరోజు తెలుసుకుందాం:
1923 మే 28న కృష్ణా జిల్లాకు చెందిన పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు నందమూరి తారకరామారావు. విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో స్కూల్ విద్య పూర్తి చేశారు. అనంతరం విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరారు.
1942 మే నెలలో ఆయనకు ఇరవై ఏళ్ళప్పుడూ, తన మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకానిచ్చి, వివాహం జరిపించారు. దీంతో విజయవాడ కళాశాల నుంచి మారి.. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటకాలు, వాటికి సంబంధించిన కార్యకలాపాలలోనే ఎక్కువగా గడిపారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (నాట్) అనే నాటక సంస్థను స్థాపించిన సందర్భంలో కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ వంటి తదితరులతో ఎన్నో నాటకాలు వేశారు రామారావుగారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను సైతం నిర్మించింది.
1947లో పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. తదనంతరం మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాయగా, పరీక్ష రాసిన 1100 మందిలో ఏడుగుర్ని ఎంపిక చేస్తే.. అందులో ఒకరిగా నిలిచారు. దీంతో మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే తపన కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకన్నా ఎక్కువకాలం కొనసాగలేకపోయారు.
తారక రామారావు, బసవతారకం దంపతులకుగానూ 11 మంది సంతానం.. ఈ పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరిలు కుమార్తెలు.
సినిమాల్లోకి..
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాద్ దగ్గర చూసి, వెంటనే మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల అనే సినిమాలో కథానాయకుడిగా తీసుకున్నారు. దీంతో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా సమర్పించి, పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అది మొదలు 1951లో కె.వి.రెడ్డి.. పాతాళభైరవి, తర్వాత బి.ఎన్.రెడ్డి తీసిన మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాద్ పెళ్ళిచేసి చూడు, కమలాకర కామేశ్వరరావు వంటి చిత్రాలు ఆయన్ను నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
పాతాళభైరవి చిత్రం అయితే 10 కేంద్రాలలో 100 రోజులు ఆడి, ఘన విజయాన్ని సాధించింది.
1956లో విడుదలైన మాయాబజార్ సినిమాకు గానూ.. 7,500 రూపాయల పారితోషికం అందుకున్నారు. ఇది అప్పట్లో అత్యధికమైన పారితోషికం మరీ.
1959లో ఏ.వి.యం. ప్రొడక్షన్స్ వారే నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలోని రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశారంటే అతిశయోక్తి కాదు.
1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయాన్ని సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు పాత్రలు పోషించి, ఆయన నటకౌశల్యాన్ని ప్రదర్శించి, ఆశ్చర్యపరిచారు.
సంవత్సరానికి ఏకబిగిన 10 సినిమాల చొప్పున నటిస్తూ, అగ్రతారగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పేరుగాంచారు.
1963లో విడుదలైన లవకుశ మరో అద్భుతమైన విజయాన్ని అందించింది. పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన రెండు దశాబ్దాల్లోనే వేల రూపాయల పారితోషికం నుంచి లక్షల్లో పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకున్నారు.
పౌరాణిక చిత్రాల్లో మేటిగా నిలిచిన ‘మాయాబజార్’ సిల్వర్ జూబ్లీగా నిలవడంతో.. అదే ఏడాది ‘వినాయకచవితి’లోనూ కృష్ణుడిగా కనిపించాడు. ఆ తర్వాత ‘శ్రీ కృష్ణార్జునయుద్ధం’, ‘దీపావళి’.. వంటి సినిమాల్లోనూ కృష్ణ పాత్రల్లోని వైవిధ్యాన్ని మనకు చూపించారు.
ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించడం కాదు… కృష్ణుడే ఆ పాత్ర కోసం దిగొచ్చాడా అని అనుకునేవారు తెలుగు ప్రజలు.
- 1963లో ఎన్టీఆర్కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది.
- 1959లో లవకుశను తీశారు. తెరమీద సాక్షాత్తూ శ్రీరాముడినే చూసిన భావన కలిగింది. అంతేకాక తెలుగు సినీ చరిత్రలో కోటి రూపాయలు వసూళ్లు తెచ్చిపెట్టిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇంతటితో ఆగకుండా..‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’లో శ్రీనివాసుడిగా, ‘భూకైలాస్’లో ప్రతినాయక ఛాయలున్న రావణుడిగా మెప్పించారు. దీని తర్వాత వచ్చిందే.. ‘దానవీర శూరకర్ణ’.. ఇందులో మూడు ముఖ్య పాత్రలకు ప్రాణం పోశారు.
కర్ణ, దుర్యోధన, శ్రీకృష్ణుడు.. ఇలా మూడు విభిన్న వ్యక్తిత్వాలున్న పాత్రలలో నటించి సాటిలేని నటుడిగానే కాక, దర్శకుడిగానూ ప్రఖ్యాతి పొందారు. పౌరాణిక పాత్రలు చేస్తూనే.. ‘రక్తసంబంధం’లో అన్నగా, ‘గుండమ్మ కథ’లో నిక్కరుతో వచ్చే ‘అంజి’గా… మర్చిపోలేని పాత్రలు చేశారాయన.