
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడిపోయిందా? ట్రంప్ తీసుకొచ్చిన ఓ కొత్త బిల్లుకు మస్క్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఈ బిల్లు వల్ల మస్క్ నడిపిస్తున్న డాగీ డిపార్ట్మెంట్కు ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు డోజ్ అంటే ఏంటి, దీని పని ఏమిటి? మస్క్ అమెరికా ఖర్చులను తగ్గించడానికి మస్క్ ఏం చేశాడు? ఇప్పుడు ట్రంప్ చర్యలతో మస్క్ పనులు బూడిదలో పోసిన పన్నీరేనా? వీళ్ల గొడవకు బ్రొమాన్స్ అని ఎందుకు పేరు పెట్టారు..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎలాన్ మస్క్. ఈ ఇద్దరి స్నేహం ఒకప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి మస్క్ చాలా సాయం చేశాడు. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత అయిన మస్క్, ట్రంప్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేశాడు. దాదాపు 290 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 2,400 కోట్ల రూపాయలు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల కోసం వెచ్చించాడు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. తన X సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రంప్‌కు మద్దతుగా పోస్ట్‌లు పెట్టాడు. ట్రంప్ కోసం ర్యాలీలు చేశాడు, ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త రకంగా ప్రచారం చేశాడు. ఈ స్నేహం వల్ల ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడు, మస్క్ కూడా అమెరికా ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషించే అవకాశం పొందాడు.
ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, మస్క్‌కు ఓ పెద్ద బాధ్యత ఇచ్చాడు. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, సంక్షిప్తంగా డోజ్ అంటారు. 2025 జనవరిలో ఈ విభాగాన్ని ట్రంప్, మస్క్ కలిసి ప్రారంభించారు. డాగీ లక్ష్యం ఏంటంటే, అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, అవసరం లేని వ్యయాలను కట్ చేయడం, అవినీతి, వృధాను అరికట్టడం. ఈ విభాగానికి మస్క్ నాయకత్వం వహించాడు. ఈ విభాగం 2026 జులై 4 వరకు పనిచేయాలని నిర్ణయించారు. మస్క్ ఈ బాధ్యత తీసుకున్నాక, దాదాపు 11 ప్రభుత్వ ఏజెన్సీలను మూసేశాడు. 2,50,000 మంది ఉద్యోగులను తొలగించాడు. అమెరికా ఖర్చుల్లో సుమారు 160 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేశాడు. అయితే, కొందరు నిపుణులు ఈ లెక్కలు సరిగా లేవని, ఇందులో తప్పులున్నాయని చెప్పారు. అంతేకాదు, ఈ కట్ల వల్ల అమెరికా ఖర్చులు మరింత పెరిగాయని, దాదాపు 135 బిలియన్ డాలర్లు అదనంగా ఖర్చు అయ్యాయని విమర్శలు వచ్చాయి.
మస్క్ తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చలేదు. అవసరం లేని కాంట్రాక్ట్‌లు, గ్రాంట్లు, లీజ్‌లను రద్దు చేశాడు. అమెరికా విదేశీ సహాయాన్ని నిలిపివేశాడు. USAID అనే ఏజెన్సీని మూసేశాడు. ఈ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు సహాయం చేసేది. విద్య, ఆరోగ్యం, పరిశోధనల కోసం ఇచ్చే నిధులను కూడా కట్ చేశాడు. కొన్ని స్కూళ్లు కోవిడ్ రిలీఫ్ ఫండ్స్‌ను లగ్జరీ హోటళ్లు, ఐస్‌క్రీమ్ ట్రక్కుల కోసం ఖర్చు చేశాయని మస్క్ ఆరోపించాడు. ఈ ఖర్చులను నిలిపివేశాడు. అయితే, ఈ నిర్ణయాలు అమెరికా ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చాయి. బిల్ గేట్స్లాంటి ప్రముఖులు మస్క్ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. USAID మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు చనిపోతారని, వ్యాధులు మళ్లీ వస్తాయని హెచ్చరించారు. ఒక సర్వేలో 57% మంది అమెరికన్లు మస్క్ పనితీరును తప్పుపట్టారు. ఈ విమర్శలతో మస్క్ కాస్త వెనక్కి తగ్గాడు, డోజ్ లో తన పాత్రను కాస్త తగ్గించుకున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. ట్రంప్ మాత్రం మస్క్ ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ట్రంప్, మస్క్ మధ్య దూరం ఎందుకు పెరిగింది? ట్రంప్ ఇటీవల ఓ కొత్త బిల్లును తీసుకొచ్చాడు, దీన్ని బిగ్, బ్యూటిఫుల్ బిల్ అని పిలుస్తున్నా. ఈ బిల్లులో పెద్ద ఎత్తున పన్ను తగ్గింపులు, సైన్యం, జాతీయ భద్రత కోసం భారీ ఖర్చులు ఉన్నాయి. అయితే, దీని కోసం ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల్లో కోతలు విధించారు. ఈ బిల్లు వల్ల అమెరికా బడ్జెట్ లోటు 3.8 ట్రిలియన్ డాలర్లు, అంటే సుమారు 320 లక్షల కోట్ల రూపాయలు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదం పొందింది. ఇప్పుడు సెనేట్‌కు వెళ్లింది. కానీ, మస్క్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు డోజ్ లక్ష్యాలను దెబ్బతీస్తుందని, అమెరికా బడ్జెట్ లోటును పెంచుతుందని మస్క్ అంటున్నారు. తాను 160 బిలియన్ డాలర్లు ఆదా చేశానని, కానీ ఈ బిల్లు వల్ల అదంతా వృథా అవుతుందని మస్క్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తనను, తన బృందం శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేసిందన్నారు.
అయితే ట్రంప్, మస్క్ మధ్య గొడవకు మరో కారణం కూడా ఉంది. మస్క్ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నుంచి చైనాతో జరిగే భవిష్యత్ యుద్ధ ప్రణాళికల గురించి రహస్య సమాచారం తీసుకోవాలని ప్రయత్నించాడని ఆరోపణలు ఉణ్నాయి. కానీ, ట్రంప్ దీన్ని అడ్డుకున్నారు. ఎందుకంటే, మస్క్‌కు చైనాలో టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల ద్వారా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ సమాచారం ఇస్తే, మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయొచ్చని ట్రంప్ భావించారు. ఈ విషయం బయటకు రావడంతో, ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ స్పందించారు. చైనా యుద్ధ ప్రణాళికల విషయంలో మస్క్‌కు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ట్రంప్, మస్క్ మధ్య దూరం పెరగడానికి కారణం కావొచ్చని స్టీవ్ బానన్ అన్నారు. ఈ విషయంలో ట్రంప్, మస్క్ మధ్య నమ్మకం తగ్గిపోయిందన్నారు. దీనితో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని చెబుతున్నారు.
ఈ గొడవను చూసి కొందరు ట్రంప్, మస్క్ బ్రొమాన్స్ ముగిసిందా? అని సెటైర్లు వేస్తున్నారు. X ప్లాట్ఫామ్లో ఈ విషయంపై చాలా మంది హాస్యాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఒకరు ట్రంప్, మస్క్ స్నేహం ఒకప్పుడు చూడముచ్చటగా ఉండేది, ఇప్పుడు బిగ్ బిల్లు వల్ల బిగ్ ఫైట్ అయ్యింది అని రాశారు. మరొకరు మస్క్ డబ్బు ఇచ్చి ట్రంప్‌ను గెలిపించాడు, ఇప్పుడు ట్రంప్ అతన్ని వాడుకుని పక్కన పెట్టేశాడని కామెంట్ చేశారు. ఈ సెటైర్లు ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్‌ను హైలైట్ చేస్తున్నాయి. అమెరికా మీడియాలో కూడా ఈ విషయంపై చర్చలు జరిగాయి. కొందరు మస్క్ ట్రంప్‌కు ఉపయోగపడే సాధనంగా మాత్రమే ఉన్నాడని.. ఇప్పుడు అతని పని కూడా అయిపోయిందని అంటున్నారు. ఈ సెటైర్లు, విమర్శలు ఇద్దరి స్నేహం ఎంత దెబ్బతిందో చూపిస్తున్నాయి.
ఈ వివాదంతో మస్క్ డోజ్ పై ఫోకస్ తగ్గించాడు . ఇకపై వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే డోజ్ కోసం పనిచేస్తానని చెప్పాడు. తన కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్లపై ఎక్కువ దృష్టి పెడతానని ప్రకటించాడు. ఎందుకంటే, డోజ్ లో పనిచేసినందుకు అతని కంపెనీలు నష్టపోయాయి. టెస్లా లాభాలు 71% పడిపోయాయి, వాహనాల అమ్మకాలు 20% తగ్గాయి. అమెరికా ప్రజల్లో మస్క్‌పై వ్యతిరేకత కూడా పెరిగింది. ఒక సర్వేలో 56% మంది ట్రంప్, మస్క్ చేసిన ఉద్యోగాల కోతలు, ఏజెన్సీల మూసివేతలు అతిగా ఉన్నాయని అన్నారు. దీనితో మస్క్ రాజకీయాల నుంచి కాస్త దూరం జరిగాడు, భవిష్యత్తులో రాజకీయ ఫండింగ్‌ను తగ్గిస్తానని చెప్పాడు.
ట్రంప్ మాత్రం ఈ గొడవపై పెద్దగా స్పందించలేదు. తమకు ఎలాంటి విభేదాలు లేవని… మస్క్ డోజ్ కోసం చేసిన కృషికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్రంప్ చెప్పాడు. కానీ, ఈ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మస్క్ తన కంపెనీలపై దృష్టి పెడుతున్నా, డోజ్ పనులు కొనసాగుతాయని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందుతుందా, లేదా మరో మలుపు తిరుగుతుందా అనేది చూడాలి. ట్రంప్, మస్క్ స్నేహం ఇంకా ఎలా సాగుతుందో, డాగీ లక్ష్యాలు నెరవేరుతాయో లేదో సమయమే చెప్పాలి.