సీనియర్ నాయకులపై డ్రోన్ దాడులు జరిగాయన్న ఉల్ఫా-ఐ.!

Spread the love

ULFA-I drone attacks: మయన్మార్ లో అంతర్యుద్ధం కారణంగా సైనిక పాలన కొనసాగుతోంది. దీంతో ఆ దేశంతో సరిహద్దు పంచుకున్న భారత్ కు కూడా తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మయన్మార్ అలజడి ప్రభావం పడకుండా భారత్ జాగ్రత్త పడుతోంది. అయితే ఈ సమయంలోనే మయన్మార్‌లోని ఉల్ఫా-ఐ స్థావరాలపై భారత సైన్యం డ్రోన్ దాడులు చేసినట్లు ఆ సంస్థ ఆరోపణలు చేసింది. అయితే, భారత సైన్యం ఈ దాడులపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఇటువంటి ఆపరేషన్ జరపలేదని స్పష్టం చేసింది. అసలు భారత్ దాడులు చేసిందా లేదా..? అసలు ఈ ఉల్ఫా బ్యాచ్ ఎవరు..?

సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ తర్వాత శత్రు దేశాల్లోని భూభాగంలోకి వెళ్లి దెబ్బకొట్టడంలో భారత్ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. తాజాగా జూలై 13న తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతంలో ఉల్ఫా-ఐ స్థావరాలపై భారత సైన్యం డ్రోన్, మిస్సైల్ దాడులు చేసినట్లు ఆ సంస్థ ఆరోపించింది. ఈ దాడుల్లో తమ ముగ్గురు సీనియర్ నాయకులు మరణించారని, 19 మంది గాయపడ్డారని ఉల్ఫా-ఐ తెలిపింది. నయన్ అసోమ్ నాయకుడు మరణించిన తర్వాత అతడి అంత్యక్రియల సమయంలో మరో మిస్సైల్ దాడి జరిగిందని, ఈ దాడిలో మరో ఇద్దరు కీలక నాయకులు మరణించారని ఉల్ఫా-ఐ పేర్కొంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్, ఫ్రాన్స్ తయారీ డ్రోన్‌లు, దాదాపు 150 బాంబులు ఉపయోగించినట్లు సంస్థ ఆరోపించింది. నాగాలాండ్‌లోని లాంగ్వా, అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగ్సౌ పాస్ సమీపంలోని స్థావరాలపై ఈ దాడులు జరిగినట్లు తెలిపింది.

అయితే భారత సైన్యం ఈ దాడులపై స్పందించింది. ఈ దాడులపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఇటువంటి ఆపరేషన్ జరపలేదని స్పష్టం చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ దాడుల్లో అస్సాం పోలీసుల భాగస్వామ్యం లేదని, అస్సాం నుంచి ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఆపరేషన్లు జరిగితే సాధారణంగా సైన్యం ఒక ప్రకటన విడుదల చేస్తుందని శర్మ అన్నారు. ఈ దాడులు మయన్మార్‌లోని స్థానిక సంస్థలు, ఇతర గ్రూపులు చేసినవి కావచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మయన్మార్ సైన్యం, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ వంటి సంస్థలు ఈ దాడుల వెనుక ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి, అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ULFA-I drone attacks.

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ -ఉల్ఫా 1979లో అస్సాంలోని సివసాగర్‌లో స్థాపించబడింది. అస్సామ్‌ను భారత్ నుంచి విడిపించి స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం. 1980లు, 1990లలో అనేక హింసాత్మక కార్యకలాపాలు, బాంబు దాడులు, కిడ్నాపుల, దోపిడీల ద్వారా అస్సాంలో భయానక వాతావరణాన్ని ఉల్ఫా సృష్టించింది. 1990లో కేంద్ర ప్రభుత్వం ఉల్ఫాపై నిషేధం విధించింది. 2011లో ఉల్ఫా రెండు వర్గాలుగా విడిపోయింది. అరబింద రాజ్‌ఖోవా నేతృత్వంలో ప్రో-టాక్ వర్గం శాంతి చర్చలకు సిద్ధమైతే.. స్వతంత్ర అస్సాం కోసం సాయుధ పోరాటం కొనసాగించాలనే ఉల్ఫా-ఐ పరేశ్ బరువా నేతృత్వంలో ఏర్పడింది. ఉల్ఫా-ఐ మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంది, అక్కడ 200-250 మంది సాయుధ క్యాడర్‌లను కలిగి ఉంది. ఈ సంస్థ మయన్మార్‌లోని నాగా సెల్ఫ్-అడ్మినిస్ట్రేటెడ్ జోన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023లో ప్రో-టాక్ వర్గం భారత ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది, కానీ ఉల్ఫా-ఐ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తోంది. అయితే మయన్మార్ లో సైనిక పాలన ఉండటంతో ఉల్పా-ఐ మరింత రెచ్చిపోతోంది.

మయన్మార్‌లో 2021 ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు తర్వాత దేశం తీవ్రమైన అంతర్యుద్ధంలో కూరుకుపోయింది. సైన్యం అధికారంలోకి వచ్చిన తర్వాత, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ వంటి సంస్థలు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉన్న సగైంగ్ ప్రాంతం, ఉల్ఫా-ఐ, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలాండ్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వంటి అనేక తిరుగుబాటు సంస్థలకు ఆశ్రయంగా ఉంది. 1,600 కిలోమీటర్ల ఇండియా-మయన్మార్ సరిహద్దు దట్టమైన అడవుల వల్ల తిరుగుబాటుదారులకు సురక్షిత ఆశ్రయంగా మారింది. మయన్మార్‌లోని అస్థిర పరిస్థితులు, సైన్యం, తిరుగుబాటు గ్రూపుల మధ్య జరుగుతున్న పోరాటాలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచాయి.

భారత్ గతంలో కూడా మయన్మార్‌లోని తిరుగుబాటు స్థావరాలపై దాడులు చేసిన చరిత్ర ఉంది. 2015లో ఆపరేషన్ హాట్ పర్స్యూట్, 2019లో ఆపరేషన్ సన్‌రైజ్‌లో భారత సైన్యం మయన్మార్ సైన్యంతో కలిసి ఉల్ఫా, NSCN వంటి సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్లలో లోయిటరింగ్ మ్యూనిషన్స్, డ్రోన్‌లను ఉపయోగించారు. అయితే, ఇటీవల దాడుల ఆరోపణలను భారత సైన్యం ఖండించడం వల్ల ఈ దాడులు మయన్మార్ లోని స్థానిక సంస్థలు ఇతర శక్తులు చేసినవి కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. భారత్ తన ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు సంస్థలను అణచివేయడానికి సైనిక ఒత్తిడి, శాంతి చర్చలు, ఆర్థిక అభివృద్ధి అనే మూడు-పాయింట్ల వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ వ్యూహం వల్ల ఉల్ఫా-ఐ సామర్థ్యం, రిక్రూట్‌మెంట్, దోపిడీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి.

భారత్ ఈ దాడులు తాము చేయలేదని చెప్పినప్పటికీ ఉల్ఫా-ఐ మాత్రం.. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే ఉల్ఫా -ఐకు ప్రస్తుతం అంత సీన్ లేదని అంటున్నారు. ఈ సంస్థ సామర్థ్యం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ నివేదిక ప్రకారం, జాతీయ సంబరాల సమయంలో IED దాడులు చేయాలని ఉల్ఫా-ఐ ప్లాన్ చేసింది. ఈ సంస్థలో ప్రస్తుతం ఒకే ఒక సీనియర్ నాయకుడు అరుణోదయ్ దోహోతియా మాత్రమే మయన్మార్‌లో మిగిలి ఉన్నాడు, మరో నాయకుడు రూపమ్ అసోమ్ ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఉల్ఫా-ఐ ప్రభావం ఎలా ఉన్నా..ఈ బెదిరింపులు, మయన్మార్‌లోని అస్థిర పరిస్థితులు ఈశాన్య భారతదేశంలో భద్రతా సవాళ్లపై కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇది చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలకు సరిహద్దులను పంచుకోవడంతో వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. అందుకే ఆ ప్రాంతాల్లో తిరుగుబాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహారిస్తోంది.

Also Read: https://mega9tv.com/national/air-india-ai171-flight-crash-tragedy-what-aaib-preliminary-report-reveals/