
Atacama Desert Flowers: ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పూల సోయగాలతో వికసిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పొడి వాతావరణం కలిగిన ప్రదేశం ఇప్పుడు పువ్వులతో కళకళలాడుతోంది. ఏడాదికి సగటున 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అటకామా ఎడారి రంగురంగుల పుష్పాలతో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ సుందర దృశ్యం మరికొన్ని రోజులు మాత్రమే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
అటకామా ఎడారి..ఈ ఎడారి చిలీ దేశంలో అటు ఆండీస్ పర్వతాలు, ఇటు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇది అత్యంత పొడి వాతావరణం కలిగిన ప్రాంతం. రాత్రిపూట ఆకాశాన్ని ఎంతో క్లియర్ గా చూసే ప్రదేశాలలో ఇదొకటి. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌కు నిలయంగా ఈ ఎడారి చాలా ఫేమస్. సాధారణంగా ఈ ప్రాంతం ఎప్పుడూ బీడుగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఒక్క చుక్క నీరు లేకుండా శతాబ్దాలు గడిచిపోయిన సంవర్భాలు ఉన్నాయి. ఇక్కడ పచ్చదనం చూడాలంటే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిందే. అది కూడా వర్షం పడితేనే.అయితే ఆ అదృష్టం ఇప్పుడు మనకు కలిగింది. ఈ ఏడాది శీతాకాలంలో సదరన్ హెమీస్పియర్ లో గణనీయంగా పెరిగిన వర్షపాతం కారణంగా ఇప్పుడు అటకామా రంగురంగుల అందమైన పూలతో తివాచీలా కనువిందు చేస్తోంది.అటకామా ఎడారిలో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాలలో ఒకటిగా 2025 నిలిచింది. Atacama Desert Flowers.
సాధారణంగా అటకామా ఎడారిలో ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఏడాది ఈ ప్రాంతంలో 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు నెలలోనే 12 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.అంతకుముందు, జూన్ నెలలో ఈ ఎడారి ప్రాంతాన్ని మంచు కప్పేసింది. అరుదైన అధిక వర్షపాతం, అధిక హిమపాతం కారణంగా అక్కడి నేలలో కొన్నేళ్లుగా నిద్రాణ స్థితిలో ఉన్న విత్తనాలు మేల్కున్నాయి. అద్భుతమైన అడవిపూల తివాచీలు ఏర్పడటానికి దోహదం చేశాయి.
అటకామా ఎడారిలో 200 కంటే ఎక్కువ జాతుల పుష్పాల విత్తనాలు ఉంటాయట. వీటిలో కొన్ని జాతుల పూలు ప్రపంచంలో మరెక్కడా పెరగవు. అమేజాన్ బేసిన్ నుంచి వచ్చే తేమ ప్రభావంతో ఎడారిలో వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పూల విత్తనాలు మొలకెత్తడానికి కనీసం 15 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. పూలు వికసించడానికి నీటితో పాటు సూర్యకిరణాలు, తేమ శాతం కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది అధిక వర్షపాతంతో ఈ అద్భుతమైన పువ్వుల వికాసం దర్శనమిచ్చింది. సాధారణంగా ఆగస్టు నెలాఖరు నుంచి నవంబరు రెండో వారం వరకు ఈ పూల అందాలను మనం చూడొచ్చు. ఈ దృశ్యం మరికొన్ని వారాల పాటు ఉంటుందని చిలీ నేషనల్ ఫారెస్ట్ కార్పొరేషన్ చెబుతోంది.