
Muhammed Yunus Gift To Pakistan: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్ మరోసారి వివాదాన్ని రాజేశారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బంగ్లాదేశ్ మ్యాప్‌ను పాక్ సైనిక ఉన్నతాధికారికి ఆయన బహూకరించారు. దీంతో ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ కోసం పిలుపునిస్తున్న అతివాద ఇస్లామిక్ గ్రూపులకు బంగ్లా సర్కారు వంతపాడుతోందా అనే చర్చ మొదలైంది. ఇండియాపై విషం కక్కుతున్న యూనుస్- పాక్, బంగ్లా, చైనా దగ్గరవుతున్నాయా? అసలు ఏం జరుగుతోంది.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్‌కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచే ఈశాన్య భారత రాష్ట్రాలపై మహ్మద్ యూనుస్ విషం కక్కుతున్నారు. ఇక ఇదే సమయంలో భారత్ విరోధులైన పాకిస్థాన్, చైనాలతో కార్యకలాపాలు చేస్తున్నట్లే అనుకోవాలి. 1971 సంవత్సరంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని సాధించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమే. అందుకే భారత్ – బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. ఈక్రమంలోనే గత వారం చివర్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్పర్సన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఢాకా నగరం వేదికగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరుదేశాల సైనిక సంబంధాలపై వారు చర్చించారు. ఈసందర్భంగా జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు బంగ్లాదేశ్ మ్యాప్‌తో పాటు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పుస్తకాన్ని యూనుస్ బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూనుస్ ట్వీట్ చేశారు.
ఆ ఫొటోలను చూస్తే, బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారతదేశంలోని అసోం సహా ఈశాన్య రాష్ట్రాలన్నీ ఉన్నాయి. దీన్ని చూసి భారతీయ నెటిజన్లు ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్‌లను ఎందుకు ప్రింట్ చేస్తున్నారంటూ యూనుస్‌ను ప్రశ్నించారు. ఇకపోతే ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించకపోవడం గమనార్హం. ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పుస్తకం విషయానికొస్తే, 2024 సంవత్సరం జులైలో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంపై ఈ బుక్‌ను రాశారు. ఈ ఉద్యమం వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని అంటారు. గతంలో విద్యార్థులు జరిపిన హింసాత్మక నిరసనల వల్ల, భారత్‌ను సమర్ధించే షేక్ హసీనా సర్కారు కూలిపోయింది. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ పెరిగింది.
ఈశాన్య భారత రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్ విషం కక్కడం ఇదే తొలిసారేం కాదు. గతంలో పలు అంతర్జాతీయ వేదికలపైనా దీని గురించి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా చైనాలో యూనుస్ పర్యటించారు. అక్కడ చేసిన ప్రసంగంలో ఈశాన్య భారత రాష్ట్రాలను ఆయన ప్రస్తావించారు. “ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాల చుట్టూ భూమే ఉంది. అందువల్ల వాటికి సముద్ర మార్గంలో భద్రత కల్పించగల ఏకైక దేశం బంగ్లాదేశ్ మాత్రమే. ఇదొక పెద్ద అవకాశం. దీన్ని అదునుగా చేసుకొని మా ప్రాంతంలోకి చైనా తన ప్రభావాన్ని విస్తరించాలి. తద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి” అని యూనుస్ అప్పట్లో వ్యాఖ్యానించారు.
2024 సంవత్సరంలో యూనుస్ మరో సన్నిహితుడు నహీదుల్ ఇస్లాం బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మ్యాప్‌లో పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కలిపి ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ను ఏర్పాటు చేయాలని నహీదుల్ ఇస్లాం డిమాండ్ చేయడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సోషల్ మీడియా పోస్ట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు దీన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది.
ఢాకా ఉగ్రదాడి తర్వాత తొమ్మిదేళ్లకు వివాదాస్పద మతబోధకుడు, భారత్ నుంచి పరారైన జకీర్ నాయక్ నవంబరు 28నుంచి సుమారు నెల రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు యూనస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. 2016లో ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ వద్ద ఉగ్రదాడి జరిగింది. యూట్యూబ్‌లో జకీర్ నాయక్ ప్రసంగాలు విని ప్రేరణ పొందానని ఆ ఉగ్రదాడి నిందితుల్లో ఒకరు దర్యాప్తు అధికారులకు వెల్లడించిన నేపథ్యంలో నాటి షేక్ హసీనా ప్రభుత్వం జకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ టీవీ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిషేధించింది. విద్వేష ప్రసంగాలతో మతాల మధ్య చిచ్చు పెట్టారంటూ అతనిపై భారత్‌లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది మే నెలలో జమ్మూకశ్మీరులోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన వెంటనే, పాక్‌పై భారత్ ఎటాక్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా మహ్మద్ యూనుస్ సన్నిహితుడు, బంగ్లాదేశ్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ దాడి చేస్తే, భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవడానికి చైనాకు బంగ్లాదేశ్ సహకరించాలని ఆయన కామెంట్ చేశారు. Muhammed Yunus Gift To Pakistan.
ఈవిధంగా భారత్‌ను రెచ్చగొట్టేలా తన సన్నిహితులు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నా, వ్యాఖ్యలు చేస్తున్నా యూనుస్ స్పందించడం లేదు. అవన్నీ పట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరోవైపు భారత్ విరోధులైన చైనా, పాకిస్థాన్‌లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.