
Burevestnik Nuclear Cruise Missile: రష్యా రక్షణ రంగం ఎంత డెవలప్ అయితే, అంత అమెరికాకి టెన్షన్ తప్పదు. రష్యా ఎదుగుదలను అమెరికా భరించలేదు. అయినా.. రష్యా తన శక్తిని చాటుకుంటూనే ఉంది. ఇప్పుడు అణు శక్తి మిస్సైల్ ప్రయోగం విజయవంతం కావడం.. అమెరికాకు పెద్ద తలనొప్పే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఆశ్చర్యకర ప్రకటన చేశారు. అణు ఆయుధాలు మోసుకెళ్లగల అధునాతన క్రూజ్ మిస్సైల్ ‘బురెవెస్ట్నిక్’ (Burevestnik) పరీక్ష విజయవంతమైందని తెలిపారు. ఈ మిస్సైల్ 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 15 గంటల పాటు గాలిలో కంటిన్యూగా ఎగరగలదు. ఏ రక్షణ వ్యవస్థనైనా అధిగమించగల అపరిమిత శ్రేణి కలిగిన ఈ ఆయుధం, ప్రపంచంలో ఎవరికీ లేని అసాధారణ టెక్నాలజీని కలిగి ఉందని పుతిన్ తెలిపారు. ఈ పరీక్ష అక్టోబర్ 21న జరిగినప్పటికీ, ఫలితాలు విడుదల చేశారు. రష్యా సైన్య ప్రధాన కమాండర్ వాలరీ గెరాసిమోవ్ పుతిన్‌కు ఇచ్చిన రిపోర్టు ప్రకారం, ఈ మిస్సైల్ అణు శక్తి ద్వారా పనిచేస్తుంది. 50-100 మీటర్ల ఎత్తులో ఎగురుతూ, రాడార్లను మోసం చేస్తూ, శత్రు రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగలదు.
బురెవెస్ట్నిక్ అంటే గాలి పక్షి అని అర్థం. ఇది ప్రపంచంలో అణు రియాక్టర్‌తో పనిచేసే మొదటి మిస్సైల్. అణు లేదా సాంప్రదాయిక విధ్వంసకాలను మోసుకెళ్లగలదు. 8,700 మైళ్ల (సుమారు 14,000 కి.మీ.) దూరాన్ని కవర్ చేస్తూ, సాధారణ మిస్సైళ్ల కంటే చాలా సేపు గాలిలో ఉండగలదు. ఈ మిస్సైల్ అమెరికా మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను, ముఖ్యంగా ట్రంప్ ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ వంటి వాటిని అధిగమించడానికి రూపొందించినది. 2018లో పుతిన్ తన ప్రసంగంలో ఈ అధునాతన ఆయుధాల్ని ప్రదర్శించినప్పటికీ, 2019లో ఆర్కిటిక్ ప్రాంతంలో జరిగిన పరీక్షలో ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో కొన్ని పరీక్షలు విఫలమవ్వడంతో, ఈ తాజా విజయం రష్యాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.
పుతిన్ ఈ ప్రకటన సమయంలో సైనిక అధికారులతో సమావేశమై, యార్స్, సినెవా ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైళ్లు, ఖ-102 క్రూజ్ మిస్సైళ్ల ప్రయోగాల గురించి కూడా చర్చించారు. ఇవి రష్యా అణు రక్షణ వ్యవస్థ బలాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు. త్వరలో ఈ మిస్సైల్‌ను సైన్యంలో చేర్చే మౌలిక సదుపాయాలను సిద్ధం చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకటన… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరగాల్సిన సమ్మిట్ ఆకస్మికంగా రద్దు కావడం, ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాల ఉపయోగం అనుమతించడం వంటి సంఘటనల తర్వాత వచ్చింది. ఇది పాశ్చాత్య దేశాలకు ఒక హెచ్చరికగా మారింది.
అంతర్జాతీయంగా ఈ పరిణామానికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాటో, అమెరికా ఈ మిస్సైల్‌ను ‘ప్రమాదకరమైనది’గా అభివర్ణించాయి. అణు నిరోధక నిపుణుడు జెఫ్రీ లెవిస్ దీన్ని ‘చిన్న ఎగురుతున్న చెర్నోబిల్’గా పిలిచారు. ఇది ప్రపంచ భద్రతకు ముప్పు కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా-అమెరికా మధ్య న్యూ స్టార్ట్ ఆయుధ ఒప్పందాన్ని 2026 ఫిబ్రవరి వరకు పొడిగించాలనే చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. పుతిన్ ఒక సంవత్సరం పొడిగింపుకు అంగీకరిస్తామని చెప్పినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక ఒత్తిడుల మధ్య ఈ ఆయుధం మాస్కో అణు విధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ మిస్సైల్ అభివృద్ధి 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైంది. అమెరికాతో ఉన్న 1972 నాటి యాంటీ-బాలిస్టిక్ మిస్సైల్ ఒప్పందం నుంచి రెండు దేశాలూ ఉపసంహరించుకున్న తర్వాత మొదలైంది. రష్యా దీన్ని తన అణు ఆయుధాల ప్రదర్శనలో ముఖ్య భాగంగా చూపించింది. అయితే, దీని ఉపయోగం… ఆయుధ నియంత్రణ చర్చలను మరింత సంక్లిష్టం చేస్తుందనీ, రష్యా-పాశ్చాత్య దేశాల ఇది మధ్య ఉద్రిక్తతలను పెంచుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కూడా తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే ప్రమాదం కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ సైతం ఈ క్రూయిజ్ క్షిపణిని అడ్డుకోలేదనే అంచనాలు వెలువడుతున్నాయి. అణు-శక్తితో నడిచే, అపరిమిత శ్రేణి గల క్రూయిజ్ మిసైల్ కావడంతో గోల్డెన్ డోమ్‌ను సైతం దాటుకొని దాడి చేయగలదనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ రూపకల్పనలో అమెరికా మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. Burevestnik Nuclear Cruise Missile.
రష్యా తయారు చేసిన బురెవెస్ట్నిక్ క్షిపణి న్యూక్లియర్ టర్బోజెట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత ఇంధనంతో నిమిత్తం లేకుండా ఎంతదూరమైనా, ఎన్ని రోజులైనా నిరంతరాయంగా ప్రయాణించే శక్తి ఉంటుంది. గంటకు 850 నుంచి 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యం దీని సొంతం. వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా ఎలాగైనా సరే లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంటుంది. దాడి చేసే క్రమంలో ప్రయోగించిన తర్వాత మధ్యలోనే ఉపగ్రహ సిగ్నల్స్ ఆధారంగా దాడిచేసే మార్గాన్ని మళ్లించేందుకు, కొత్త లక్ష్యాలను ఎంచుకునేందుకు ఆస్కారం ఉంది.
గోల్డెన్ డోమ్ నిర్మాణం కోసం ఇప్పటికే 25 బిలియన్ డాలర్లు కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్‌ఫోర్స్‌కు చెందిన ఫోర్‌స్టార్ జనరల్ మైఖేల్ గుట్లిన్ నియమించారు ట్రంప్. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. అమెరికా వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలావరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. అయితే అణుశక్తితో నడిచే “బురెవెస్ట్‌నిక్” క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో గోల్డెన్ డోమ్‌ను ఏ తరహాలో నిర్మిస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.