
Donald Trump’s new decision: కామన్ గా పిడుగులు ఆకాశం నుంచి పడతాయి. కానీ అమెరికాలో.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ అనేది ఒకటుంది. చిత్రంగా.. దాని నుంచి అప్పుడప్పుడూ పిడుగులు పడుతుంటాయి. అవి భారతీయులకు షాక్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పిడుగు ఒకటి పడింది. ఆ డిటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. ఇదే క్రమంలో అక్రమ వలసదారుల్ని గుర్తించి బలవంతంగా స్వదేశాలకు పంపేయడంతో పాటు వారిని నిర్బంధించడం, వీసాలు రద్దు చేయడం, వీసా ఫీజుల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా భారతీయులతో పాటు వలసదారులకు ట్రంప్ మరో భారీ షాక్ ఇచ్చారు.
భారతీయుల్ని ఎన్ని రకాలుగా అవమానించవచ్చో.. అన్ని రకాలుగా అవమానిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అసలు ఇండియాని డెడ్ ఎకానమీ అని అన్నప్పుడే.. ఆయన తీరును అర్థం చేసుకోవాల్సింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం.. నువ్వు ఎన్ని తిట్టినా.. మేం పడతాం అన్నట్లు వ్యవహరిస్తుంటే.. ట్రంప్ మరింత రెచ్చిపోతున్నారు. ఆయన ప్రభుత్వం వలసదారులకు వ్యతిరేకంగా పిడుగు లాంటి నిర్ణయం తీసుకుంది. దీనిపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం, వర్క్ పర్మిట్ లను ఇకపై ఆటోమేటిక్‌గా పొడిగించే ఛాన్స్ లేదు. ఇవాళ్టీ నుంచే ఈ మార్పు అమలులోకి వచ్చింది.
అమెరికాలో హెచ్ 1 బీ కాకుండా వచ్చే మిగతా వీసాల వారు అక్కడ వర్క్ చేయాలంటే ప్రత్యేక పర్మిట్ పొందాలి. దాన్ని EAD అంటారు. హెచ్ 1బీ డిపెండెంట్లుగా వచ్చే వారు ఎక్కువగా దీని కోసం అప్లై చేస్తారు. EAD తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటారు. ఇంకా చాలా వీసాల వాళ్ళు కూడా ఈ వర్క్ పర్మిట్ లను తీసుకోవాల్సిందే. ఇప్పుడు ట్రంప్ సర్కార్ వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై EAD లను ఆటో మాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. దీనికి సంబంధించి యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ప్రకటన జారీ చేసింది.
గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.
వేల మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, H1B వీసా కలిగిన వారి భార్యలు, గ్రీన్‌కార్డు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నవారు.. ఇప్పుడు తమ ఉద్యోగాల్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. USCIS అధికారులు చెప్పిన దాని ప్రకారం.. అక్టోబర్ 30 తర్వాత రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి.. ఆటోమేటిక్‌గా పొడిగింపు ఉండదు. వర్క్ పర్మిట్ పొడిగించాలా వద్దా అనేది అధికారులు.. విడివిడిగా, మాన్యువల్‌గా నిర్ణయం తీసుకుంటారు. అక్టోబర్ 30కి ముందు దరఖాస్తు చేసుకున్నవారి EADలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వారికి ఆటోమేటిక్‌గా పొడిగింపు వచ్చేస్తుంది. కొత్తగా అప్లై చేసుకునేవారికే ఈ కొత్త రూల్.
ఇకపోతే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి వలసదారుల్ని చూసి కుళ్లుకుంటోంది. వీళ్లంతా అమెరికాకి వచ్చి.. ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ.. ఇక్కడే స్థిరపడిపోతున్నారు అని చూసి ఓర్వలేకపోతోంది. నిజానికి ఈ వలసదారులే.. అమెరికా ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా.. ఈ ఎన్నారైలే ఉంటున్నారు. ఈ నిజాన్ని ట్రంప్ గుర్తించేందుకు సిద్ధంగా లేరు. మరో మెలిక కూడా పెట్టారు. వలసదారులు తమ EAD గడువు ముగిసే 180 రోజుల ముందే రెన్యువల్ కోసం అప్లై చేసుకోవాలి. దాంతో గడువు పొడిగింపు లభిస్తుందనే గ్యారెంటీ లేదు. ముందుగా అప్లై చేసుకోకపోతే, ఉద్యోగాన్ని తాత్కాలికంగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. లేటుగా దరఖాస్తు చేసుకున్నవారికి.. వర్క్ పర్మిట్ పొడిగించేదీ, లేనిదీ అధికారులు వెంటనే చెప్పరు. మరోవైపు.. వారి దరఖాస్తు పెండింగ్‌లో పడి.. ఉద్యోగం తాత్కాలికంగా పోయే ప్రమాదం ఉంటుంది.
EAD అనేది అమెరికాలో కొంత కాలం పని చేసేందుకు అనుమతి ఇచ్చే పత్రం. గ్రీన్‌కార్డు ఉన్నవారికి ఇది అక్కర్లేదు. H1B, L1B, O, P వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు ఉన్నవారికి కూడా పని చేసేందుకు అనుమతి ఉంటుంది. కానీ H4 , గ్రీన్‌కార్డు అప్లై చేసినవారు, F1/M1 విద్యార్థుల డిపెండెంట్లు, టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ హోల్డర్ల వంటి వారికి EAD తప్పనిసరి. ఇలాంటి వారు ఇండియా నుంచి లక్షల మంది ఉన్నారు. వీరు అమెరికాలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. H1B భార్యలు ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో పనిచేస్తున్నారు. వారికి EAD రెన్యువల్ పొడిగించకపోతే, వారి సంపాదన ఆగిపోతుంది. ఇక అమెరికాలో ఉండటం కష్టమైపోతుంది. ఉంటే.. రోజూ వేలల్లో ఖర్చులు అవుతాయి. H1B వీసాదారుల భార్యలకు ఇది పెద్ద దెబ్బ అంటున్నారు నిపుణులు.
ఇక మరోవైపు వలసదారుల సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. “ఇది లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కి జరుగుతున్న అన్యాయం” అంటూ బౌండ్‌లెస్ ఇమ్మిగ్రేషన్ వంటి సంస్థలు ఆందోళన చేస్తున్నాయి. కానీ ట్రంప్ కోరుకుంటున్నది ఇదే. ఎలాగొలా వలసదారులు.. తమ దేశం నుంచి వెళ్లిపోతే.. ఆ ఉద్యోగాలను స్థానికులు పొందుతారని అనుకుంటున్నారు. కానీ స్థానికులకు అంత టాలెంట్, స్కిల్ లేదు. వాళ్లకు అది లేకపోవడం వల్లే.. విదేశాల నుంచి ఉద్యోగుల్ని తీసుకుంటున్నాయి కంపెనీలు. ఈ విషయం ట్రంప్‌కి కూడా తెలుసు. కానీ.. ఆయనలో తెల్లజాతీయులే అమెరికాలో ఉండాలనే దుర్మార్గపు ఆలోచన ఉంది. అందుకే.. రకరకాల లిటిగేషన్లు పెట్టి.. వలసదారులు, ఎన్నారైలను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. Donald Trump’s new decision.
మొత్తానికి, వలస విధానాల్లో కఠినతరం దిశగా ట్రంప్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని నిపుణులు అంటున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ నిబంధనలు కఠినం కావడంతో వలసదారుల భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారనుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.