చేయని నేరానికి 43 ఏళ్లు జైలులోనే
ఇప్పుడు దేశ బహిష్కరణ!
ఎవరీ వేదం సుబ్రహ్మణ్యం?
తొమ్మిది నెలల ప్రాయంలో భారత్ నుంచి అమెరికాకు పయనం.. 19 ఏళ్లకు స్నేహితుడి హత్య కేసులో అరెస్టై నాలుగు దశాబ్దాలు జైలు గోడల మధ్యే.. సుదీర్ఘ న్యాయపోరాటంతో చివరకు నిర్దోషిగా తేలినా మరో కేసులో మళ్లీ నిర్బంధంలోకి..! ఇదీ భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యం అమెరికాలో ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి! నాలుగు దశాబ్దాల కాలంలో అనేక మలుపులు తిరిగిన ఈ కేసు అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలోనే అత్యంత అసాధారణమైనదిగా నిలుస్తోంది. అసలు ఎవరీ వేదం సుబ్రహ్మణ్యం..? చేయని నేరానికి 43 ఏళ్లు జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది.
అమానుషమైన అన్యాయానికి, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని కఠినత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న భారత సంతతికి చెందిన సుబ్రమణ్యం వేదం కేసు తాజాగా ఉపశమనం పొందింది. హత్య కేసులో తప్పుడు నిర్ధారణ కారణంగా 43 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదలైన వేదంను దేశం నుంచి బహిష్కరించవద్దని రెండు యూఎస్ కోర్టులు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాయి. సుబ్రమణ్యం వేదం జీవితంలో జరిగిన ఈ విషాదకర ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.
సుబ్రహ్మణ్యం వేదంపై నమోదైన మాదకద్రవ్యాల కేసులో ప్రస్తుతం తిరిగి భారత్‌కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం డిపోర్టేషన్‌పై ఇమిగ్రేషన్ జడ్జి స్టే విధించారు. ఆయన కేసును సమీక్షించాలా, వద్దా దానిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ నిర్ణయం తీసుకునే వరకు నిలిపివేయాలని ఆదేశించారు. మరోవైపు పెన్సిల్వేనియాలోని జిల్లా కోర్టు కూడా బహిష్కరణపై స్టే విధించింది. దీంతో దేశం నుంచి బహిష్కరణపై ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది.
1962లో సుబ్రహ్మణ్యం వేదం కుటుంబం అమెరికాకు చట్టబద్ధంగా వలస వచ్చింది. ఆ సమయంలో ఆయనకు తొమ్మిది నెలలు ఉంటాయి. పెన్సిల్వేనియాలోని స్టేట్ కాలేజీలో స్థిరపడిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. 1980లో తన స్నేహితుడు థామస్ కిన్సర్ కనిపించకుండా పోయాడు. తొమ్మిది నెలల తర్వాత శవమై కనిపించాడు. అయితే చివరిసారిగా థామస్‌తో సుబ్రహ్మణ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 1982లో అరెస్ట్ చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయనపై హత్యా నేరం అభియోగాలు మోపారు.
దీంతో 1983లో కోర్టు దోషిగా తేల్చి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశారు. అయితే 2022లో అక్రమంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారికోసం పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ సుబ్రహ్మణ్యానికి సపోర్ట్ గా నిలిచింది. ఈ కేసును సమీక్షించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం కొనసాగించింది. చివరకు సరైన ఆధారాలు లేవని తేలడంతో పెన్సిల్వేనియా కోర్టు ఇటీవల అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అక్టోబర్ 3న జైలు నుంచి విడుదల చేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత సుబ్రహ్మణ్యం బయటకు వస్తుండడంతో స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఆనందంలో మునిగిపోయారు.కానీ అక్కడే సుబ్రహ్మణ్యంను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే హత్య కేసులో అరెస్ట్‌కు కొంతకాలం ముందు సుబ్రహ్మణంపై మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు నమోదైంది. ఈ కేసులో ఆయన దోషిగా తేలడంతో చట్టపరంగా దేశ బహిష్కరణ ముప్పు ఎదురైంది. హత్య కేసులో జైల్లో ఉండటంతో దీనికి బ్రేక్‌లు పడ్డాయి. 43 సంవత్సరాలు తర్వాత జైలు నుంచి విడుదలైన సుబ్రహ్మణ్యంను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసును కారణంగా చూపుతూ ఇప్పుడు ఆయన్ను దేశం నుంచి బహిష్కరించాలని ఐసీఈ అధికారులు చూస్తున్నారు. హత్య కేసులో తీర్పు మారినంత మాత్రాన, డ్రగ్స్ కేసు శిక్ష రద్దు చేయలేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. చేయని నేరానికి 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని, ఇది డ్రగ్స్ కేసులో విధించే శిక్ష కంటే ఎక్కువేని సుబ్రహ్మణ్యం న్యాయవాదులు, ఆయన సోదరి మళ్లీ న్యాయపోరాటం మొదలుపెట్టారు.
సుబ్రమణ్యం వేదం తరఫున లాయర్లు, ఆయన సోదరి సరస్వతి వేదం ఐసీఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లో మగ్గిన వ్యక్తి విషయంలో ఈ పాత చిన్నపాటి డ్రగ్స్ కేసును పరిగణనలోకి తీసుకోరాదని వారు వాదించారు. జైల్లో ఉన్నప్పుడే ఆయన మూడు డిగ్రీలు సంపాదించి, తోటి ఖైదీలకు ట్యూటర్‌గా సేవలందించారని, అతని సుదీర్ఘమైన తప్పుడు నిర్బంధాన్ని పరిగణించాలి అని కోర్టును అభ్యర్థించారు.
ఈ వాదనల నేపథ్యంలో వేదం సుబ్రమణ్యంకి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇమ్మిగ్రేషన్ కోర్టులో ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సుబ్రమణ్యం వేదం బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.పెన్సిల్వేనియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఆయన బహిష్కరణపై స్టే విధించింది.