కూలీ డబ్బులు కూడా రావడం లేదు.. చిత్తూరులో పుష్ప విలాపం..!!

Spread the love

రాష్ట్రంలో పూల సాగులో గులాబీ తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట కూడా ఇదే. అయితే పండుగలు, పర్వదినాలలో మాత్రం కాసులు కురిపించే ఈ పంట, ప్రస్తుతం రైతుకు నష్టాలను తెచ్చిపెడుతోంది. అన్ సీజన్ కావడంతో మార్కెట్ లో గిట్టుబాటు ధర లేక చిత్తూరు జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. కూలీ రేట్లు కూడా రవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

కార్యక్రమం ఏదైనా, వేదికను మాత్రం నిండుగా, అందంగా, ఆకర్షణీయంగా నిలిపేది మాత్రం పూలనే చెప్పాలి. పండుగలు, పర్వదినాలు, వివాహ వేడుకలతో పాటు డెకరేషన్లలో ఎక్కువగా వాడే చామంతికి, ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుంది. అందుకే, చిత్తూరు జిల్లాలో భారీగా వాటిని సాగుచేస్తున్నారు రైతులు. ముఖ్యంగా శీతాకాలంలో విరబూసే సువాసనల చామంతి, అన్నదాత ఇంట సిరుల వర్షం కురిపిస్తుందని నమ్మకం. అందుకే ప్రతి ఏటా పండుగ నెలల్లో దిగుబడి వచ్చే విధంగా రైతులు పంట సాగుచేసి లాభాలు పొందుతుంటారు.అంతా బాగుంది కదా అని అనుకుంటున్న సమయంలో మార్కెట్ లో ఒక్కసారిగా ధర పడిపోయి రైతుకు నిరాశ మిగుల్చుతోంది.పెళ్లిళ్లు, పండుగలతో మొన్నటి వరకు భారీగా పలికిన పూల ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

జిల్లాలో పండించే చామంతిని చెన్నై, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల్లోని ఫ్లవర్ మార్కెట్లకు తరలిస్తారు రైతులు.ప్రస్తుతం ధరలు లేకపోవడం, పూలకు తెగుళ్లు సోకడంతో రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పూలపై నల్లటి మచ్చలు, పురుగు కనిపిస్తుండటంతో ధరలు అమాంతం తగ్గిపోయాయి. వారం కిందటి వరకు కిలో చామంతి పూలు 400 నుంచి 120 రూపాయలు వరకు ధర పలికింది.ప్రస్తుతం కిలోకి 80 రూపాయలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో చామంతి పూలకి గిరాకీ ఉంటుందని, అయితే పెళ్లిళ్లు, పండుగల సీజన్ లేనందున ధర తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ చామంతి పూలకు ఇంత తక్కువ ధర పలకలేదని, కూలీ రేట్లు కూడా మిగలడం లేదని రైతులు చెబుతున్నారు.

చామంతి పూలుకి రేట్లు లేవని, పల్లెల్లో అయితే, కేజీ పదికి, ఐదుకి అడుగుతున్నారని చిన్న వ్యాపారులు సైతం వాపోతున్నారు. పూలే జీవనాధారంగా బ్రతుకుతున్న తమకు లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.