ఏఐతో తెగుళ్లకు చెక్‌…రైతుల కోసం అత్యాధునిక ఏఐ వ్యవస్థ

Spread the love

మన దేశంలో వ్యవసాయం అనగానే ముందుగా గుర్తొచ్చేది రైతన్న పడే కష్టం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి.. ఏదో ఒక తెగులు సోకి ఎకరాలకు ఎకరాలు నాశనం అయిపోతుంది. అసలు పంటకు ఏ తెగులు వచ్చింది అని రైతు తెలుసుకునే లోపే.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.అయితే ఇకపై   రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృత్రిమ మేధ  ఒక బ్రహ్మాస్త్రంలా మన ముందుకు వచ్చింది. పంట ఆకులను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి, తెగుళ్లను ఆరంభ దశలోనే ముందే పసిగట్టే ఒక అద్భుతమైన టెక్నాలజీని  హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. అసలు ఈ ఏఐ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? రైతుల కష్టాలను ఇది ఎలా దూరం చేయబోతోంది అనే విషయాలను  తెలుసుకుందాం.

పంటలకు సోకే తెగుళ్లను ప్రాథమిక దశలోనే గుర్తించి, వాటికి సరైన నివారణోపాయాలు సూచించేలా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ అత్యాధునిక ఏఐ  వ్యవస్థకు రూపకల్పన చేశారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. విజయ సరస్వతి తో పాటు మరో 9 మంది పరిశోధకుల బృందం కలిసి ఈ అద్భుతమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. వీరు సృష్టించిన ఈ టెక్నాలజీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే.. దీనికి ఏకంగా భారత ప్రభుత్వ పేటెంట్  కూడా లభించింది. ప్రతి సంవత్సరం తెగుళ్లను సకాలంలో గుర్తించలేక రైతులు తీవ్రమైన దిగుబడి నష్టాన్ని చవిచూస్తున్నారు. ఆ నష్టాన్ని శాశ్వతంగా అరికట్టడమే లక్ష్యంగా ఈ పరిశోధనా బృందం అహర్నిశలు శ్రమించింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? అంటే..దీనికోసం పరిశోధకులు కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్  అనే ఒక అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి ఆకుల తెగుళ్లను గుర్తించే విభాగాన్ని రూపొందించారు. ముఖ్యంగా మన రైతులు ఎక్కువగా సాగు చేసే టొమాటో, బంగాళాదుంప,  క్యాప్సికమ్ పంటలకు చెందిన ఏకంగా 20 వేల ఆకుల ఫోటోల డేటాసెట్‌ను ఉపయోగించి ఈ ఏఐ కి శిక్షణ ఇచ్చారు. పంటల్లో సాధారణంగా కనిపించే ప్రధాన తెగుళ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎప్పుడైతే ఒక రైతు తన పొలంలోని ఆకును స్కాన్ చేస్తాడో, ఈ ఏఐ వ్యవస్థ ఆ ఆకు చిత్రాలను విశ్లేషించి ఏకంగా 97.7 శాతం కచ్చితత్వంతో.. అది ఏ తెగులో ఆరంభ దశలోనే ఇట్టే పసిగడుతుంది. 

ఈ టెక్నాలజీలో ఉన్న మరో గొప్ప విశేషం ఏంటంటే.. ఇది కేవలం తెగులును గుర్తించి ఊరుకోదు. ఆ తెగులును తక్షణమే నివారించడానికి రైతు వాడాల్సిన సరైన క్రిమిసంహారక  మందులను కూడా స్క్రీన్ పై స్పష్టంగా సూచిస్తుంది. సాధారణంగా తెగులు ముదిరిపోతే మొక్కలో కిరణజన్య సంయో గక్రియ , పరాగసంపర్కం ఆగిపోయి మొక్క పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. కానీ ఈ ఏఐ ద్వారా ఆరంభ దశలోనే తెగులును  కనిపెట్టడం వల్ల.. మొక్క ఎదుగుదల ఏమాత్రం దెబ్బతినక ముందే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ మందుల వాడకంతో పంటను సేఫ్ గా కాపాడుకోవచ్చు అన్నమాట ఈ గొప్ప ఆవిష్కరణ వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన డాక్టర్ విజయ సరస్వతి  స్వయంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. పంటలను ఆశించే తెగుళ్లను ఆలస్యంగా గుర్తించడం వల్ల ఎకరాలకు ఎకరాలు పంట నాశనమై రైతులు పడే ఆవేదనను ఆమె చిన్నప్పటి నుంచి చాలా దగ్గర్నుంచి చూశారు. సరిగ్గా ఆ అనుభవమే రైతుల కోసం ఇలాంటి ఒక వినూత్నమైన పరిశోధన చేయడానికి బలమైన పునాది వేసింది. స్తుతం ఈ సాంకేతికత ఒక వెబ్ ఇంటర్‌ఫేస్‌లో అందరికీ అందుబాటులో ఉంది. అయితే సామాన్య రైతులకు మరింత సులభంగా చేరవేయడానికి వీలుగా.. పరిశోధక బృందం దీని కోసం ఒక స్పెషల్ మొబైల్ యాప్   కూడా రూపొందిస్తోంది. ఇది అతి త్వరలోనే పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రాబోతోంది.  మొత్తం మీద చూసుకుంటే, భవిష్యత్తులో వ్యవసాయం ఎంత హైటెక్ గా మారబోతోందో చెప్పడానికి ఈ టెక్నాలజీ ఒక సజీవ సాక్ష్యం. రైతుల కన్నీళ్లు తుడిచే ఇలాంటి ఆవిష్కరణలు మన దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *