తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా దేవుడంటే తమ కుటుంబానికి అపారమైన గౌరవం ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదానం చేస్తున్న విషయాన్ని పేర్కొన్నారు. అలాంటి తమపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ హెరిటేజ్ డెయిరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సభ్యుల ఆరోపణలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభకు రావాలన్నారు. గత పదేళ్లుగా మా బాబు పుట్టినరోజు మార్చి 21 తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారు. టెండర్ లో ఎల్-3 వస్తే రాదు.. ఎల్-1 వారికి మాత్రమే వస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి. లడ్డూలో కల్తీ అంశం తప్ప వైసీపీ సభ్యులు అన్నీ మాట్లాడతారని దుయ్యబట్టారు. దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం. మాకు రైట్ ఉన్నా తిరుమలలో ఏనాడూ ముఖద్వారం నుంచి వెళ్లలేదు. క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లినట్లు పేర్కొన్నారు. మీ నాయకుడు జగన్ రెడ్డి డిక్లరేషన్ పై కనీసం సంతకం పెట్టలేదు. మీరా మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు. కల్తీ జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలని, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడని మండిపడ్డారు.