కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

పండుగలు, జాతరలు మన సంస్కృతిలో భాగమని మన సంప్రదాయాలను ఆచరిస్తూ, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ సంతృప్తిని కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి తన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అంతా మేలు జరిగేలా చూడమని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో చూడాలనే మా ప్రయత్నాలకు ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
ఇక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం చంద్రబాబు దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా కాన్వాయ్ ను నిలిపి వారి వద్దకు వెళ్లి తాటి .ముంజలు తిన్నారు.

కార్మికులు అందించిన తాజా తాటిముంజలను సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో చంద్రబాబు కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక దీనికి సంబంధించి చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కల్తీ లేదు… కార్బైడ్ లేదు….పురుగు మందుల గోల లేదు…మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్చమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. చిరు వ్యాపారుల వద్దకు సాక్ష్యాత్తు సీఎం వెళ్లి కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒక రాష్ట్రానికి అత్యున్నత నాయకుడైన ముఖ్యమంత్రి, ప్రోటోకాల్స్ మరియు భద్రతా వలయాలను దాటుకుని సామాన్య ప్రజల చెంతకు వచ్చినప్పుడు, అది పాలకులకు మరియు ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేస్తుందని తాము కేవలం ఓటర్లుగానే కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములమనే భావన ప్రజల్లో కలుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాయకుడు కేవలం ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకే దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న ఆత్మీయ పలకరింపులు ప్రజల మనస్సులలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయంటున్నారు. ఇలాంటి నాయకులను ప్రజలు కేవలం ఒక రాజకీయ నాయకుడిగానో, ముఖ్యమంత్రిగానో చూడరు; తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా, తమను చనువుగా పలకరించిన ఆత్మీయుడిగా భావిస్తారని ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడిలా నిలుస్తారనే కామెంట్స్ వస్తున్నాయి.