మహిళలకు సంఘీభావం తెలుపుతూ, సమ్మిళిత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఉద్దేశపూర్వక జాప్యం వల్ల మన శాసన సభలలో మహిళలకు దక్కాల్సిన నాయకత్వ స్థానం దక్కకుండా పోయిందని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, సమానత్వం మరియు ప్రాతినిధ్యాన్ని పెంపొందించే ఒక చారిత్రాత్మక అవకాశాన్ని దేశం కోల్పోయేలా చేసిందన్నారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) మరియు రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం పట్ల ప్రతిపక్ష పార్టీల తీరును ఏపీ సీఎం, టీడీపీ అధినేత, ఎన్డీయే కీలక నేత చంద్రబాబు తప్పుబట్టారు. ఆర్టికల్ 81 ప్రకారం ఉన్న నిబంధనలు 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణనతో ముగియనున్నాయని ఈ నేపథ్యంలో, రాబోయే జనాభా గణన కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పంపిణీని మారుస్తుందన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. సమాఖ్య సమతుల్యతను కాపాడటానికి, దక్షిణాది, ఈశాన్య మరియు చిన్న రాష్ట్రాల గొంతుకను రక్షించడానికి, అలాగే మహిళలకు 33% ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి NDA ప్రభుత్వం చేసిన హృదయపూర్వక ప్రయత్నం ఈ ప్రతిపాదన అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో నిర్వహించిన ర్యాలీలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.