కూటమి ప్రభుత్వ తీరు అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన పాపాన్ని, మహానేతవై.ఎస్.ఆర్ కు చుట్టడం చంద్రబాబుకు భావ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. వైసీపీ కల్తీ పనులు నాటి వై.ఎస్.ఆర్ నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదని అసెంబ్లీ వేదికగా వై.ఎస్.ఆర్ పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. దివంగత సీఎంపై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దివంగత నేతకు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలన్నారు. వై.ఎస్.ఆర్ 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడూ అనుకోలేదని జరిగిందంతా తప్పుడు ప్రచారమేనని షర్మిల స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు వై.ఎస్.ఆర్. 7 కొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత GO ఇచ్చి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు అమలు చేశారు. జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారు. తిరుమల లడ్డూ పవిత్రతకు రక్షణగా నిలబడ్డారు. లడ్డూకు పేటెంట్ రైట్ సాధించింది 2009 లో నాడు వై.ఎస్.ఆర్ సీఎంగా ఉండగానే. వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారు. తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పెట్టారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం కట్టారు. వేద పండిట్ ల కోసం ఆనాడే వై.ఎస్.ఆర్ ఆయుష్మాన్ భవ స్కీమ్ అమలు చేశారు. దళితులకు గోవిందుడు దగ్గరవ్వాలని అమలు చేసిన “దళిత గోవిందం” ఆనాడు మహానేత తీసుకున్న గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈ నాటికి వై.ఎస్ ను దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం. వైసీపీ చేసిన అరాచకాలకు వై.ఎస్.ఆర్ కు సంబంధం లేదని షర్మిల పునరుద్ఘాటించారు. వై.ఎస్ పాలన సంక్షేమ పాలన. వైసీపీ పాలన దోచుకు తిన్న పాలనని మండిపడ్డారు. వైసీపీలో వై.ఎస్.ఆర్ లేడు. రాజశేఖర్ రెడ్డిగారు ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి. కడవరకు కాంగ్రెస్ లోనే బ్రతికిన మనిషని షర్మిల పేర్కొన్నారు.