టూరిజం సంబంధిత అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB)లో అమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. అటవీ, దేవాదాయశాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని, ప్రశాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి రెడీ చేయాలని సూచించారు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గోదావరి పుష్కరఘాట్ తో పాటు హావ్ లాక్ బ్రిడ్జిపై టూరిస్ట్ లను అనుమతించే పనులు ఈ సంవత్సరం డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.