ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. ప్రతి ఏటా ఇచ్చినట్టుగానే అన్నదాన ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించారు.ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారి సేవలో తరించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు, భక్తులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. టీటీడీ సేవలు ఎలా అందుతున్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కలిగేలా రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు. భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్య క్షేత్రం కావడంతో జనసాంద్రత, దర్శన‑సమయాలను సమర్థంగా నిర్వహించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు. AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ద్వారా జనసాంద్రత, దర్శనం వెయిటింగ్ టైమ్, వాహన చలనం, అకామిడేషన్, సీసీటీవీ, వైద్య అత్యవసరాలు అన్నీ ఒకే ప్లాట్‌ఫారం ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షణ చేయనున్నారు. AI‑బేస్డ్ విశ్లేషణ ద్వారా రద్దీ పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. దీని ఏర్పాటులో ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవ చూపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా స్పూర్తిగా నిలుస్తోంది.