వచ్చే ఏడాది పాదయాత్రతో వస్తున్నా:శ్రేణులతో మాజీ సీఎం జగన్

Spread the love

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత  వైయస్‌ జగన్‌ మాట్లాడారు.  ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. “దోచుకో.. పంచుకో.. తినుకో..” అనే సిద్ధాంతంతో పాలిస్తోందని జగన్ ఆరోపించారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర మొదలుపెడతానని శ్రేణులకు తెలిపారు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలుపై ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని శ్రేణులకు తెలిపారు.  ఏపీకి రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాజధానికి సంబంధించి ఆయన రెండు ప్లాన్లను సూచించారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచడాన్ని మంచి ఆప్షన్ గా చెప్పారు. ఒకవేళ వికేంద్రీకరణ వద్దంటే  మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కిలోమీటర్ల కారిడార్‌ను (మావిగన్) రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు, అందులో కేవలం 10 శాతం పెడితే ‘మావిగన్’ ప్రాంతంలో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించవచ్చని జగన్ వివరించారు. గ్రోత్ ఇంజిన్ లా అభివృద్ధి చెంది మరో 20 ఏళ్ల తర్వాతైనా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో పోకుండా మావిగాన్ లోనే ఉంటారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *