డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ 

Spread the love

ఆంధ్రప్రదేశ్‌ లోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు కుటుంబ భారాన్ని మోస్తూ, కేవలం చిన్నచిన్న పనులు లేదా కూలీ పనులకే పరిమితమైన మహిళలను మరింత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఏపీ సర్కార్ ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలను కేవలం కూలీలుగా కాకుండా, పది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఒక కొత్త ప్రాజెక్టును అమలు చేయనుంది. అదే  PMFME–స్త్రీనిధి అనుసంధాన పథకం. ఈ పథకం ద్వారా ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం, దానికి తోడు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా అందనుంది. ఆహార శుద్ధి యూనిట్లు, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు  ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా ఏకంగా  3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనుంది.ఇక్కడే మరో అద్భుతమైన అవకాశం కూడా ఉంది. కేవలం స్త్రీనిధి రుణం మాత్రమే కాకుండా, దీనికి కేంద్ర ప్రభుత్వానికే చెందిన PMFME  పథకాన్ని అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల స్త్రీనిధి రుణం తీసుకున్న మహిళలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ  కూడా అందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు తమకు అనుకూలమైన పచ్చళ్లు, కారం పొడులు, స్నాక్స్, చిరుధాన్యాల ప్రాసెసింగ్ లాంటి వ్యాపారాలను సులభంగా ప్రారంభించేందుకు ఆర్థికంగా గొప్ప వెసులుబాటు కలగనుంది. ఇక ఈ పథకానికి అర్హులైన డ్వాక్రా మహిళలను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఉండే డ్వాక్రా సమాఖ్యలను డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్లు గా వినియోగించనున్నారు. అంటే, ఏ గ్రామంలో ఏ మహిళకు వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉంది, ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అనే విషయాలను ఈ సంస్థలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాయి. వ్యాపారం పట్ల ఆసక్తి, అనుభవం ఉన్న అర్హులైన మహిళలను ఈ DROలు గుర్తించి, వారికి అవసరమైన తొలిదశ సహకారాన్ని, గైడెన్స్‌ ను అందిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల నిజంగా వ్యాపారం చేయాలనుకునే కష్టపడే మహిళలకు మాత్రమే ఈ పథకం ఫలాలు దక్కుతాయి. కేవలం  3 లక్షల రుణం అందించడమే కాకుండా మహిళలు ఏర్పాటు చేయబోయే యూనిట్లకు ముందుగా అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రభుత్వమే సహాయం చేస్తుంది. ఆ తర్వాత యంత్రాల కొనుగోలుకు సాంకేతిక మార్గదర్శకత్వం, తయారు చేసిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ , ఒక మంచి బ్రాండింగ్   తీసుకురావడం,  వాటిని అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్  వంటి అంశాల్లోనూ ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. మహిళలు ఎంతో కష్టపడి తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించి.. వారి వ్యాపారాలు నష్టపోకుండా స్థిరంగా కొనసాగేలా చేయూతనిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ ఛేంజర్‌గా మారబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *