ఎన్టీఆర్ జిల్లాలోని దేవనిచెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలలో ఆహార నాణ్యత సరిగా లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై మేము వెంటనే స్పందించాము. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాము. వారి నివేదిక ఆధారంగా, సదరు భోజన ఏజెన్సీని మార్చడంతో పాటు, ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం జరిగిందని లోకేష్ ‘ఎక్స్’ లో తెలిపారు. ఇలాంటి సమస్యలను తక్షణమే గుర్తించేలా పర్యవేక్షణను పటిష్టం చేస్తున్నామన్నారు. LEAP యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకునేలా మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మన విద్యార్థులకు నాణ్యమైన వసతులు పొందే హక్కు ఉంది, అది వారికి అందేలా మేము నిరంతరం కృషి చేస్తామని భరోసానిచ్చారు.