ఆంధ్రప్రదేశ్ లో10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో చిన్న మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు ఎగ్జామ్ తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు ఎగ్జామ్ ను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ ఒక్క పరీక్ష తేదీ మినహా మిగిలిన అన్ని పరీక్షల షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. కాగా, 10వ తరగతి పరీక్షలు ముందుగా నిర్ణయించినట్లుగానే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సవరించిన పూర్తి టైమ్ టేబుల్ కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inను సందర్శించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.