పొలిటికల్ తుఫాన్ పవన్ కుటుంబానికి  ప్రధాని మోడీ ఆత్మీయ పలకరింపు

Spread the love

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్ ను ఆయన కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లి ఇటీవల సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న పవన్ ను మోడీ పరామర్శించారు. ప్రజలకు మరింత విస్తృత సేవలు చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా మోడీ పవన్ తో అన్నారు. 

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోడీకి పవన్ కుటుంబ సభ్యులు హార్ధిక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్యం గురించి, శస్త్ర చికిత్స గురించి వాకబు చేసి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. 

ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు

గత కొన్నేళ్లుగా సాగించిన పర్యటనల్లో దుమ్ము ధూళి రేగిపోయి – సైనస్ లోకి చేరిపోయి ఒక చిన్నపాటి గట్టి బాల్ మాదిరిగా మారిపోయి తీవ్ర ఇబ్బంది కలిగించి ఇన్ఫెక్షన్ అయిందని, కంటిపైనా ప్రభావం చూపిందని  ఆ క్రమంలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫేస్) చేశారని పవన్ తెలిపారు. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగారు. భుజాల దగ్గర మజిల్ కి గతంలో తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అని వైద్యులు తెలిపారని, వాటికి సర్జరీలు చేయాల్సి ఉందని, స్పైనల్ కార్డ్ కి సంబంధించి సమస్య ఉందని పవన్ తెలిపారు. పవన్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదెలతో మాట్లాడుతూ కొన్ని రష్యన్ పదాలు పలికారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ సందర్భంగా తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థాంక్యూ కార్డులను మోదీకి అందించారు. మార్క్ శంకర్ ను దగ్గరకు తీసుకొని ‘నీ గురించి మేమందరం ఎంతో కంగారుపడ్డాము. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని సింగపూర్ లో నువ్వు ఎలా ఉన్నావో అని మేమంతా ఆందోళనపడి, నీ గురించే ఆలోచించేలా చేశావు కదరా బాబూ’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. 

ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు… నువ్వూ అటు వైపే వెళ్తున్నావా

పవన్ పెద్ద కుమారుడు అకీరా నందన్ తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని ప్రధాని మోడీ అడిగారు. ప్రస్తుతం మార్షన్ ఆర్ట్స్ నేర్చుకొంటున్నాను, అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నాను అని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు… నువ్వూ అటు వైపే వెళ్తున్నావా అని చమత్కరించారు. ఈ సందర్భంగా- ప్రఖ్యాత హిందీ కవి  రాంధారీ సింగ్ దినకర్ జీ కవితను వినిపించి, అందుకు సంబంధించి వివరాలను అకీరా నందన్ వినిపించారు. ఆ కవితకు ముగ్ధుడైన ప్రధాని మోడీ   రాంధారీ సింగ్ దినకర్ జీ ఎంతో కఠినమైన హిందీ భాషను రాశారు.. కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు అని అకీరాను అభినందించారు. 

మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి

పవన్ కుమార్తెలతో ప్రధాని మాట్లాడారు. ఆద్య కొణిదెల ఏమి చదువుతున్నారో అడిగారు. ఈ సందర్భంగా ఆద్య  తన అమ్మమ్మ గారి వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని చెప్పారు. ఆద్యతో కూడా మోదీ హిందీలో మాట్లాడారు. చిన్న కుమార్తె పలీనా అంజని ఇంగ్లీష్ లో మాట్లాడారు. హిందీ వచ్చా అని ప్రధాని  అడిగారు. తనకు హిందీ రాదు అని పలీనా తెలిపారు. ఈ సందర్భంగా పలీనా, శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి అని సరదాగా అన్నారు. సుమారు 20 నిమిషాలపాటు ప్రధాని మోడీ పవన్ తోఉన్నారు. అనంతరం పవన్ కుటుంబం ప్రధానికి కృతజ్ఞతలు తెలియచేసింది. ‘ప్రధాని మోడీ  ఇంటికి వచ్చి చూపించిన అప్యాయతను, ప్రేమపూర్వక సంభాషణలను ఎప్పటికీ మరచిపోలేమని ఇంటిల్లిపాదీ ప్రధానితో అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *