భారతదేశంలోని ప్రతి మూలలో రాజకీయ ఆలోచనా విధానంలో వస్తున్న మార్పు వంశపారంపర్య రాజకీయాలపై ప్రజలు విసిగిపోయారని సూచిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణాలో ఆయన పర్యటించిన ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా జనార్ధన్ అయిన బెంగాల్ ప్రజలు భయానక నియంతృత్వ రాజకీయాన్ని ఓడించారని అందుకే ఈ రోజు అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్నారు. ఈ రోజు వారు కుటుంబ రాజకీయాల కన్నా పని చేసే వ్యవస్థను ఎంచుకుంటున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన తెలంగాణయే లక్ష్యంగా కొత్త దార్శనికత , నూతన నిబద్ధతతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నేపథ్యంలో మన బాధ్యతలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కొన్ని సంకల్పాలు చేసుకుని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సవాళ్లను మనం అధిగమించాలి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఏ మార్గాలైనా ఉంటే, వాటిని తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు. అందరూ స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని ఇందుకోసం ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం, ప్రతి సమాజం, ప్రతి సంస్థ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలను 7 విజ్ఞప్తులు చేశారు. వీలైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుండే పని) విధానానికి ప్రాధాన్యత ఇవ్వండి. కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనడాన్ని తగ్గించడం. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి; ప్రయాణాలకు మెట్రో లేదా ప్రజా రవాణా వ్యవస్థలను (Public Transport) ఉపయోగించుకోవడం.వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవడం. రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయడం. విదేశీ బ్రాండ్ల వాడకాన్ని తగ్గించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం వంటి వాటిని ప్రధాని సూచించారు.